• facebook
  • whatsapp
  • telegram

డీఎస్సీ-2019 నియామకాల్లో నిబంధనల ఉల్లంఘన?

ఈనాడు, అమరావతి: ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీ-2019లో అనేక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కొందరికి అర్హత లేకపోయినా సర్వీసు పాయింట్లు కలిపి ఉద్యోగాలు ఇవ్వగా.. మరికొందరికి డీఎస్సీ పరీక్ష సమాయానికి బీఈడీ పూర్తికాకున్నా కొలువులిచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. రాష్ట్రవ్యాప్తంగా 602 పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరి 15న పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక డీఎస్సీ ప్రకటన ప్రకారం.. దరఖాస్తు చేసుకునే సమయానికి బీఈడీ పూర్తి చేసి ఉండాలి. కొందరు డీఎస్సీ పరీక్ష ముగిశాక బీఈడీ సెమిస్టర్‌ పరీక్షలు రాశారు. వీరిలో కొంతమంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కడప జిల్లాలో దరఖాస్తు సమయానికి బీఈడీ అర్హత లేని డి.ఇంద్రావతి అనే అభ్యర్థికి ఇటీవల నియామక పత్రాలు ఇచ్చి, ఆ తర్వాత రద్దు చేశారు. నెల్లూరులో విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన సమయంలో నిబంధనలకు అనుగుణంగా బీఈడీ పూర్తి కాలేదని గుర్తించిన అధికారులు ఓ అభ్యర్థి నియామకం నిలిపివేశారు. దీంతో ఆ అభ్యర్థి కడప జిల్లాలో నియామకం ఇచ్చి, నెల్లూరులో ఎలా ఆపేస్తారని ఫిర్యాదు చేశారు. ఫలితంగా కడపలో అక్రమం వెలుగులోకి వచ్చింది. కృష్ణా జిల్లాలోనూ ఇలాంటి నియామకం చేపట్టినట్లు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుడు రవీంద్రనాథ్‌రెడ్డిని ‘ఈనాడు’ వివరణ కోరగా సమగ్ర విచారణ చేపడతామన్నారు.