• facebook
  • whatsapp
  • telegram

ఎంబీబీఎస్‌తో కేంద్ర సర్వీసుల్లోకి...

* మొత్తం ఖాళీలు 859

ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు కేంద్ర సర్వీసుల్లో పనిచేసే అవకాశం వచ్చింది. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ) దాదాపు ఏటా నిర్వహిస్తోన్న కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (సీఎంఎస్‌) ప్రకటన వెలువడింది. 559 ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీంతోపాటు ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌లోనూ 300 పోస్టులు ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూలతో వీటిని సొంతం చేసుకోవచ్చు. వీటిలో ఏ పోస్టుకి ఎంపికైనారూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు.
ఎంబీబీఎస్‌ అనంతరం ప్రభుత్వోద్యోగంలో స్థిరపడాలనుకున్నవారికి కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ చక్కని అవకాశాలుగా చెప్పుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైనవారికి ఆకర్షణీయ వేతనం, మంచి హోదా సొంతమవుతాయి. వివిధ సౌకర్యాలనూ కల్పిస్తారు.


యూపీఎస్సీ సీఎంఎస్‌
ఎంపిక విధానం: ముందుగా కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీనికి 500 మార్కులు కేటాయించారు. రెండు పేపర్‌లుంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ఒక్కోదాని వ్యవధి 2 గంటలు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. ఇందులో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూ వంద మార్కులకు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైనవారికి లెవెల్‌ 10 మూలవేతనం రూ.56,100 అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనం. నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సునూ చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొత్తం అన్నీ కలుపుకుని రూ.లక్ష కంటే ఎక్కువ వేతనం పొందవచ్చు.
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 559
విభాగాలవారీ: సెంట్రల్‌ హెల్త్‌ సర్వీస్‌లో జూనియర్‌ స్కేల్‌ పోస్టులు: 182, రైల్వేలో అసిస్టెంట్‌ డివిజినల్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 300, ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ హెల్త్‌ సర్వీస్‌లో అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌: 66, న్యూదిల్లీ మునిసిపల్‌ కార్యాలయాల్లో జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌: 11
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 32 ఏళ్లకు మించరాదు. ఆగస్టు 2, 1988 కంటే ముందు జన్మించినవారు అనర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.


పరీక్ష తేదీ: అక్టోబర్‌ 22.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు: ఆగస్టు 18 సాయంత్రం 6 వరకు స్వీకరిస్తారు.
వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/


ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా. వీటిని ఆర్మీ ఆసుపత్రి దిల్లీలో ఆగస్టు 31 నుంచి నిర్వహిస్తారు. ఎన్‌సీసీ ఎ సర్టిఫికెట్‌ ఉంటే 2, బీకి 3, సీ ఉన్నవారికి 5 మార్కులు కలుపుతారు.
ఈ పోస్టులను షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ విధానంలో భర్తీ చేస్తారు. అంటే ఎంపికైనవారు గరిష్ఠంగా 14 ఏళ్లు విధుల్లో కొనసాగుతారు. అయితే ఆసక్తి, అవసరాల ప్రాతిపదికన శాశ్వత ఉద్యోగిగా కొనసాగడానికీ అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు ఆర్మీ, నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో ఎందులోనైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరిని ఆర్మీలో అయితే కెప్టెన్‌ హోదాతో తీసుకుంటారు. నేవీ, ఏర్‌ఫోర్స్‌ల్లో చేరినవారికి ఇందుకు సమాన హోదా కేటాయిస్తారు. వీరికి వేతన స్కేలు 10బి మూలవేతనం రూ.61,300 చెల్లిస్తారు. దీంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతుంది. అలాగే నాన్‌ ప్రాక్టీస్‌ అలవెన్సు ఉంటుంది. వీటికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు అదనంగా లభిస్తాయి. అంటే విధుల్లో చేరిన మొదటి నెల నుంచే సుమారు రూ. లక్షకు పైగా వేతనం అందుకోవచ్చు.


అర్హత: ఎంబీబీఎస్‌. మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణులే అర్హులు. మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 300. ఇందులో 270 పురుషులకు, 30 మహిళలకు కేటాయించారు.
వయసు: డిసెంబరు 31, 2020 నాటికి 45 ఏళ్లకు మించరాదు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 16
వెబ్‌సైట్‌: http://www.amcsscentry.gov.in/