• facebook
  • whatsapp
  • telegram

బీఆర్క్‌లో ఎగ్జిట్‌ ఆప్షన్‌

* మూడేళ్ల తర్వాత అవకాశం
* ఆర్కిటెక్చర్‌ విద్యలో కనీస విద్యా ప్రమాణాలు, నిబంధనలు విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: అయిదేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సులో మూడేళ్లు పూర్తయ్యాక విద్యార్థులు కోర్సుపై ఇష్టం లేకుంటే దాన్ని వదిలి వేరే కోర్సులో చేరవచ్చు. అలాంటివారికి ఇక నుంచి తగిన విద్యార్హత ధ్రువీకరణ పత్రం జారీ చేయనున్నారు. జాతీయ నూతన విద్యా విధానంలో ఇలాంటి ఎగ్జిట్‌ ఆప్షన్‌ ఉండాలని కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్క్‌ కోర్సులో దాన్ని అమలు చేయాలని ఆర్కిటెక్చర్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఆర్కిటెక్చర్‌ విద్యకు సంబంధించి కనీస విద్యా ప్రమాణాలు, నిబంధనలను తాజాగా కౌన్సిల్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఈ ఏడాది నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయి. మూడేళ్లు పూర్తయ్యాక ఆరు సెమిస్టర్లలో ఉత్తీర్ణత సాధించి ఆ కోర్సును వదలి వెళ్లిపోవాలనుకునే వారికి మూడేళ్లకు సమానమైన సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ బిల్డింగ్‌ సైన్స్‌, బిల్డింగ్‌ ఆర్కిటెక్చర్‌ తదితర పేర్లతో డిగ్రీ సర్టిఫికెట్‌ ఇస్తారు. దీనిపై ఆయా విశ్వవిద్యాలయాలు నిర్ణయం తీసుకుంటాయి. చాలా మంది కోర్సుపై అవగాహన లేకుండా చేరి మధ్యలో చదువును వదిలి ఇతర కోర్సుల్లో చేరుతున్నారు. అలాంటి వారికి చదువు మొత్తం వృథా కాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరికొన్ని కొత్త నిబంధనలు...
* 8, 9 సెమిస్టర్లు అంతా విద్యార్థులు ప్రాక్టికల్‌ శిక్షణలోనే ఉండాలి.
* ప్రతి సబ్జెక్టులో 45 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణత.
* అంతర్గత మార్కులు ప్రతి సబ్జెక్టులో 50 శాతానికి మించకూడదు.
* ఏటా తరగతులు సెప్టెంబరులో మొదటి పనిదినం రోజున ప్రారంభం.
* మొత్తం ఎనిమిది సంవత్సరాల్లో కోర్సును పూర్తి చేసుకోవచ్చు. మరో ఏడాది పొడిగించేందుకు విశ్వవిద్యాలయానికి అవకాశం ఉంటుంది.
* బీఆర్క్‌లో చేరాలంటే ఇంటర్‌లో 50% మార్కులతో గణితం, భౌతిక, రసాయనశాస్త్రాలు చదివి ఉండాలి. లేదా గణితం ఒక సబ్జెక్టుగా డిప్లొమా(10+3) చేసి ఉండాలి.