• facebook
  • whatsapp
  • telegram

వైద్యనిపుణుల పోస్టుల భర్తీకి ప్రకటన జారీ

ఈనాడు, హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి, టిమ్స్‌లో కొవిడ్‌ బాధితులకు సేవలందించడానికి 85 వైద్యనిపుణులు పోస్టుల భర్తీకి వైద్యవిద్య సంచాలకుడు(డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి  ఆగస్టు 13న‌ నియామక ప్రకటన విడుదల చేశారు. ఏడాది కాలపరిమితికి ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టనున్నారు. జనరల్‌ మెడిసిన్‌లో 35, అనస్తీషియాలో 35, ఛాతీ వ్యాధుల విభాగంలో 15 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో పీజీ వైద్యవిద్య పూర్తి చేసి ఏడాది పాటు సీనియర్‌ రెసిడెంట్లుగా సేవలందించిన స్పెషలిస్టు వైద్యులు ఈ సహాయ ఆచార్యుల పోస్టులకు అర్హులు. అర్హులైనవారు ఈ నెల 17న వైద్యవిద్య సంచాలకుడి కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలని డీఎంఈ కోరారు.