• facebook
  • whatsapp
  • telegram

ఉన్నత విద్యలో పదేళ్ల ముందే సాంకేతికత

* కరోనా వల్ల అనూహ్య మార్పులు
* నల్లబోర్డు నుంచి ఆన్‌లైన్‌ తరగతుల వైపు అడుగులు
* జాతీయ విద్యా విధానంతో నాణ్యమైన కళాశాలలకే ప్రాధాన్యం
* ‘ఈనాడు’తో ఎస్‌ఆర్‌ఎం ఉపకులపతి విజయ సాంబశివరావు

ఈనాడు, అమరావతి: కరోనా కారణంగా కొన్ని నష్టాలు ఏర్పడినా ఉన్నత విద్యలో కొత్త మార్పులకు నాంది పలికిందని బిట్స్‌ పిలానీ మాజీ ఉపకులపతి, ఎస్‌ఆర్‌ఎం ప్రస్తుత ఉపకులపతి వజ్జా సాంబశివరావు వెల్లడించారు. ఉన్నత విద్యలో సాంకేతికత వినియోగానికి దశాబ్దకాలం పట్టే మార్పు కరోనాతో స్వల్పకాలంలోనే వచ్చిందన్నారు. ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆయన అనేక అంశాలను వెల్లడించారు. నల్లబోర్డు నుంచి ఆన్‌లైన్‌ బోధన విధానంలోకి వేగంగా ప్రవేశించే అవసరాన్ని కరోనా సృష్టించిందని తెలిపారు. ఉన్నత విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఈఆర్‌) పెరగాలంటే ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరని, మారుమూల గ్రామాలకు అంతర్జాల సదుపాయం కల్పించాల్సి ఉందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్నారు. ఆయన వెల్లడించిన ఆంశాలు..
పోటీని తట్టుకుంటేనే...
విద్యార్థి, పరిశ్రమల మధ్య ఉన్న అంతరం నూతన విద్యా విధానంతో తగ్గిపోతుంది. నైపుణ్యాలు, పరిశోధనలే ప్రధానంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్న వారిలో 15 శాతం మందికి నైపుణ్యాలు లేక ఉద్యోగాలు రావడం లేదు. నూతన విద్యా విధానంతో దీన్ని అధిగమించవచ్చు. దేశంలోకి విదేశీ వర్సిటీలు రానున్నాయి. ఇకపై నాణ్యమైన విద్యను అందించే కళాశాలలే పోటీలో నిలుస్తాయి. పాఠశాల స్థాయిలో సాధారణ సబ్జెక్టులతోపాటు వృత్తి విద్యను బోధించడం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరుగుతాయి.
ఎస్‌ఆర్‌ఎంలో పారిశ్రామిక పార్కు
ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం జల్‌ జనక్‌ రైల్‌ ప్రాజెక్టు పరిశోధనల దశలో ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు హైడ్రోజన్‌ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం. 2024-2028 మధ్య కాలంలో వైద్య, ఆరోగ్య సైన్సు, హుమానిటీస్‌, లా కోర్సులను ప్రవేశ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో పారిశ్రామిక పరిశోధన పార్కును నెలకొల్పనున్నాం. రోల్స్‌ రాయిస్‌, బాస్క్‌తో కలిసి పరిశోధన ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నాం.
అధ్యాపకులకు శిక్షణ అవసరం
ఇంజినీరింగ్‌లో అధ్యాపకులకు శిక్షణ ఉండాలి. పీహెచ్‌డీ చేసి నేరుగా బోధనకు వచ్చేస్తున్నారు. బిట్స్‌ పిలానీ లాంటి సంస్థల్లో ఇచ్చినట్లు.. విద్యా సంస్థలు కూడా ఆరు నెలల పాటు బోధన, సాంకేతికతపై మెలకువలు నేర్పించాలి. బిట్స్‌ పిలానీలో 1999-2004 మధ్యలో 75 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉండేవారు. అక్కడి విద్యా విధానం విద్యార్థులకు కమ్యూనికేషన్‌ నైపుణ్యం, పరిశ్రమ అనుభవం నేర్పుతుంది. 9 నెలలు పరిశ్రమలో పని చేయడం వల్ల ఉద్యోగ అనుభవం లభిస్తుంది. దీనిని అన్ని విద్యా సంస్థల్లోనూ అమల్లోకి తీసుకురావాలి. బీటెక్‌ చదువుతున్న సమయంలోనే రాజనీతిశాస్త్రం, చరిత్ర, కళలు, సాహిత్యం లాంటివి చదువుకోవచ్చు. ఈ కోర్సుల్లో 20 క్రెడిట్లు సాధిస్తే అదనంగా సర్టిఫికెట్‌ లభిస్తుంది. కృత్రిమ మేధస్సు, బిగ్‌డేటా, మెషిన్‌ లెర్నింగ్‌లాంటి అధునాతన సాంకేతికతపైనా విద్యార్థులు దృష్టి సారించాలి.