• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో డిజిటల్‌ తరగతుల నిర్వహణ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణలో రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్‌ డిజిటల్ తరగతులను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రకటించారు. ఆగ‌స్టు 20వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డిజిటల్ తరగతులు ప్రారంభించనున్న నేపథ్యంలో సగం మంది ఉపాధ్యాయులు హాజరుకావాలని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. డిజిటల్‌ తరగతుల ప్రారంభోత్సవం వాయిదా పడిన నేపథ్యంలో ఉపాధ్యాయులు హాజరుకావాల్సిన అవసరం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాలకు తెలియజేశారు. ఆగ‌స్టు 20లోగా డిజిటల్‌ తరగతుల నిర్వహణపై స్పష్టత ఇస్తామని మంత్రి వివరించారు.