• facebook
  • whatsapp
  • telegram

ఏఐఏపీజీఈటీ వాయిదా వేయాలి

* సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయుష్‌ వైద్యులు
ఈనాడు, దిల్లీ: ఆగ‌స్టు 29న నిర్వహించనున్న ఆల్‌ ఇండియా ఆయుష్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఐఏపీజీఈటీ) -2020 పరీక్ష వాయిదా వేయాలని పలువురు ఆయుష్‌ వైద్యులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కరోనా నేపథ్యంలో పరీక్ష వాయిదా వేయాలని 17 మంది వైద్యుల తరఫున న్యాయవాది అలఖ్‌ ఆలోక్‌ శ్రీవాస్తవ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌దారులంతా బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ వైద్యులమని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో ఫ్రంట్‌లైన్‌ డాక్టర్స్‌గా, కరోనా వారియర్స్‌గా విధులు నిర్వర్తిస్తున్నామని పేర్కొన్నారు. పిటిషన్‌ దాఖలు చేసిన వైద్యులు సహా చాలా మంది అభ్యర్థులు కొవిడ్‌ బారిన పడి క్వారంటైన్‌లో ఉంటున్న కారణంగా ఆగ‌స్టు 29న పరీక్షకు హాజరు కాలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. అయినప్పటికీ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14ని ఉల్లంఘించినట్లేనని తెలిపారు. కరోనాతో పాటు పలు రాష్ట్రాల్లో వరదలను దృష్టిలో ఉంచుకోవాలని అభ్యర్థించారు. కరోనా ముందు నాటి పరిస్థితి నెలకొన్న తర్వాతే పరీక్ష నిర్వహించాలని ఆ పిటిషన్‌లో కోరారు.