• facebook
  • whatsapp
  • telegram

ఇప్పట్లో బడులు లేనట్లే!

* తెరవొద్దని కేంద్రాన్ని కోరిన రాష్ట్ర విద్యాశాఖ
ఈనాడు, హైదరాబాద్‌: ఇప్పట్లో బడులు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. పాఠశాలలను భౌతికంగా తెరవవద్దని కేంద్ర విద్యాశాఖను ఇటీవల తెలంగాణ విద్యాశాఖ కోరింది. తెలంగాణతోపాటు దేశంలో అధిక శాతం రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. పాఠశాలలు ఎప్పుడు తెరవాలన్న దానిపై తల్లిదండ్రుల అభిప్రాయాలను పంపాలని కొద్ది రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఆ వివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి పంపాయి. ఈ క్రమంలో ఆగ‌స్టు 19న కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్‌ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధిక శాతం తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఇప్పట్లో బడికి పంపించడానికి సిద్ధంగా లేరని, టీకా కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అధికారులు చెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వహించేంతగా అధిక శాతం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. మొత్తానికి కనీసం అక్టోబరు/నవంబరు వరకు పాఠశాలలు తెరవకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో సిలబస్‌ను భారీగా తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.