• facebook
  • whatsapp
  • telegram

డిగ్రీ కళాశాలలకు కేటగిరీలవారీగా బోధన రుసుములు

* తొలిసారిగా యాజమాన్య కోటా 30% సీట్లు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలకు నాలుగు కేటగిరీలుగా బోధన రుసుములను నిర్ణయించనున్నారు. రుసుములపై ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కసరత్తు దాదాపుగా పూర్తయింది. కళాశాలల్లోని మౌలిక సదుపాయాలు, అధ్యాపకులు, న్యాక్‌ గుర్తింపు, జాతీయ ర్యాంకుల ఆధారంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో గరిష్ఠంగా రూ.18వేలు, రెండో కేటగిరీకి రూ.16వేలు, మూడో దానికి రూ.14వేలు, నాలుగో దానికి రూ.12వేలుగా రుసుములను నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాను తీసుకొస్తున్నారు. 30శాతం సీట్లు యాజమాన్య కోటాగా ఉంటాయి. ఈ కోటాలో ప్రవేశాలు పొందేవారికి ప్రభుత్వం బోధన రుసుములను చెల్లించదు. సంబంధిత దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే రుసుములు ప్రకటించే అవకాశముంది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం యాజమాన్యకోటా విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. గతంలో మాదిరిగానే వందశాతం కన్వీనర్‌ కోటానే ఉండాలని కోరుతున్నాయి. రాష్ట్రంలోని కళాశాలల యాజమాన్యాలు ఆగ‌స్టు 21న‌ ఆన్‌లైన్‌లో సమావేశమయ్యాయి.
మొదటిసారి ఆన్‌లైన్‌ ప్రవేశాలు..: ఈ ఏడాది డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి కళాశాలలవారీగా అనుమతి పొందిన సీట్లు, అధ్యాపకులు, మౌలికసదుపాయాల వివరాలు సేకరించింది. ప్రవేశాలకు ప్రకటన వెలువడిన వెంటనే విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఇంజినీరింగ్‌ మొదటి కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాత డిగ్రీ ప్రవేశాలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ముందుగా ప్రవేశాలు చేపడితే డిగ్రీలో సీట్లు పొందిన కొందరు ఇంజినీరింగ్‌కు వెళ్లిపోయే  అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.