• facebook
  • whatsapp
  • telegram

నీట్‌కు పెరిగిన పోటీ

* ఈ సారి 15.97 లక్షల మంది దరఖాస్తు
* గత ఏడాది కంటే 46 వేలు ఎక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: వైద్య విద్యలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్న నీట్‌(యూజీ)-2020కు మొత్తం 15,97,433 మంది హాజరుకానున్నారు. గత ఏడాది 15,51,753 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సారి మరో 45,680 మంది అధికంగా పోటీ పడనున్నారు. పరీక్షకు సంబంధించి హాల్‌టికెట్లను త్వరలో జారీ చేయనున్నారు. పరీక్ష రాసే నగరాలను మార్చుకునేందుకు ఈ దఫా విద్యార్థులకు అయిదు సార్లు జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) అవకాశం కల్పించింది. మొత్తం విద్యార్థుల్లో 99.87 శాతం మంది తమ మొదటి ఛాయిస్‌గా ఎంచుకున్న నగరం/పట్టణంలోనే పరీక్ష రాయనున్నారు.
11 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుండగా.. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు. విద్యార్థుల సెల్‌ఫోన్లకూ సంక్షిప్త సందేశాలను పంపిస్తారు.
* పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా గేటు బయట భౌతిక దూరం పాటించేందుకు తాళ్లు కట్టనున్నారు. వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశిస్తారు.