• facebook
  • whatsapp
  • telegram

టీవీ పెట్టు.. పాఠం వినేట్టు!

* పల్లెల్లో మొదలైన డిజిటల్‌ బోధన
* యాదగిరి, టీశాట్‌ ఛానెళ్ల ద్వారా ప్రసారం షురూ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో సెప్టెంబ‌రు 1 నుంచి టీవీ పాఠాల సందడి మొదలైంది. విద్యాశాఖ.. దూరదర్శన్‌ యాదగిరి, టీశాట్‌కు చెందిన విద్య ఛానెళ్ల ద్వారా ముందుగా రికార్డు చేసిన 3 నుంచి 10 తరగతుల వారికి పాఠాలను ప్రసారం చేసింది. దూరదర్శన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, విద్య ఛానెల్‌లో ఉదయం 10 నుంచి 12 గంటలు, మళ్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలను ప్రసారం చేశారు.
ఆగస్టు 27వ తేదీ నుంచి బడులకు వెళ్తున్న ఉపాధ్యాయులు సెప్టెంబ‌రు 1న‌ పలు చోట్ల గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి డిజిటల్‌ పాఠాల ప్రసారాలపై తల్లిదండ్రులు, పిల్లలకు అవగాహన కల్పించారు. స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారికి టీశాట్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఇచ్చారు. డీడీ పాఠాలను యూట్యూబ్‌లోనూ చూడొచ్చని సూచించారు. అయితే కొన్ని చోట్ల డీడీ, టీశాట్‌ ఛానెళ్లపై ఉపాధ్యాయుల్లో పూర్తిగా అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు వివరంగా చెప్పలేకపోయారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సెప్టెంబ‌రు 1న‌ ఉదయం దూరదర్శన్‌ కేంద్రానికి వెళ్లి ప్రసారాలను ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉండగా...మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మృతితో వారంపాటు సంతాప దినాలు ప్రకటించడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన ఆయా జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు పాఠాల ప్రసారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌, సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హన్మంతరావు తదితరులు పాఠాల ప్రసారాలను పరిశీలించారు.
* ఆంగ్లంలో కావాలి సర్‌...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకూ పాఠ్యాంశాలు ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటాయి. టీవీల ద్వారా పాఠాలు తెలుగులో ప్రసారం అవుతుండటంతో తమకు ఆంగ్లంలో కావాలని ఆ విద్యార్థులు అడుగుతున్నట్లు మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు తెలిపారు. ఆ పాఠశాలల్లో 10-15 గ్రామాల విద్యార్థులు చదువుతుంటారు. దాంతో ఒక్కో ఉపాధ్యాయుడు ఒక్కో గ్రామానికి వెళ్లి విద్యార్థులను కలిసి అవగాహన కల్పించారు.
* 85.42% వినియోగించుకున్నారు: మంత్రి
రాష్ట్రవ్యాప్తంగా 3 నుంచి 10వ తరగతి విద్యార్థుల్లో 85.42 శాతం మంది మొదటి రోజు వివిధ మార్గాల ద్వారా పాఠాలు వినియోగించుకున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16,43,309 మంది విద్యార్థుల్లో డీడీ, టీశాట్‌ ద్వారా 10,72,851 మంది వీక్షించారు. స్మార్ట్‌ ఫోన్లు/ల్యాప్‌టాప్‌లు/కంప్యూటర్ల ద్వారా 1,91,768 మంది, గ్రామ పంచాయతీల్లో 78,696 మంది, ఇతర మార్గాల ద్వారా 60,515 మంది..మొత్తం 14,03,830 మంది పాఠాలు వినియోగించుకున్నారని మంత్రి తెలిపారు. వర్క్‌ షీట్లను 1,42,979 మంది, టీశాట్‌ యాప్‌ను 11,56,658 మంది వినియోగించుకున్నారని వివరించారు.
* విద్యార్థులకు కొత్త అభ్యాస అనుభవం: కేటీఆర్‌
తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ టీశాట్‌ ద్వారా పాఠశాలల పిల్లలకు కొత్త అభ్యాస అనుభవం అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ట్విటర్‌లో తెలిపారు. విద్యాఛానల్‌ 3 నుంచి 10 తరగతి వరకు విద్యార్థులకు డిజిటల్‌ పాఠాలను ప్రసారం చేస్తోందని పేర్కొన్నారు.  టీశాట్‌ యాప్‌లో 4 లక్షల వినియోగదారులు, యూట్యూబ్‌ ఛానల్‌లో 4.3 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు.