• facebook
  • whatsapp
  • telegram

జేఈఈ మెయిన్‌.. అడుగడుగునా పరీక్షే!

* సెంటర్లను గుర్తించడంలో తికమక
* ఆఖరి నిమిషంలో ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి పరుగులు
* తొలిరోజు పరీక్ష రాసేందుకు గ్రామీణ విద్యార్థుల అవస్థలు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మల్లాపూర్‌: జేఈఈ మెయిన్‌ అభ్యర్థులకు ప్రయాణమే పెద్ద పరీక్ష పెట్టింది. రాష్ట్రంలో కేవలం ఆరు నగరాల్లోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు నానా అవస్థలు పడి కేంద్రాలకు చేరుకున్నారు. మొదటి రోజు బీఆర్క్‌/బీప్లానింగ్‌ పరీక్ష(పేపర్‌-2) పూర్తయింది. కరోనా నేపథ్యంలో సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఆగ‌స్టు 31 రాత్రి, సెప్టెంబ‌రు 1వ తేదీ తెల్లవారుజాము నుంచి అద్దె కార్లలో జిల్లాల నుంచి బయలుదేరి కేంద్రాలకు తరలివచ్చారు. దూరప్రాంతాల నుంచి వచ్చినవారు వేకువజామున 4 గంటలకే హైదరాబాద్‌ మల్లాపూర్‌లోని సెంటర్‌కు చేరుకున్నారు. ఉదయం ఏడు గంటలకే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించడంతో కొందరు అల్పాహారం తీసుకోకుండానే వెళ్లారు.
* 85 శాతం హాజరు
రాష్ట్రంలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో తొలిరోజు బీఆర్క్‌ పరీక్షకు 8,582 మంది హాజరుకావాల్సి ఉండగా.. వారిలో 85 శాతం మంది పరీక్ష రాసినట్లు సమాచారం.