• facebook
  • whatsapp
  • telegram

సులువుగా జేఈఈ

* తొలిరోజు ప్రశ్నపత్రాలు కాస్త తేలికే..
* కరోనా నిబంధనల మధ్య పరీక్షలు రాసిన 9వేలకుపైగా ఏపీ విద్యార్థులు

ఈనాడు, అమరావతి: లాక్‌డౌన్‌తో విద్యాసంస్థలు మూతపడిన తర్వాత విద్యార్థులు మొదటిసారిగా సెప్టెంబరు 1న జేఈఈ మెయిన్‌ పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు పరీక్ష గదుల్లో ప్రత్యేక మాస్కులు, శానిటైజర్లను అందించారు. ఉదయం ఆర్కిటెక్చర్‌, సాయంత్రం ప్లానింగ్‌ పరీక్షను నిర్వహించారు. రెండు సెషన్లకు కలిపి ఏపీ నుంచి సుమారు 9,900 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఆర్కిటెక్చర్‌లో 400 మార్కులకు 77 ప్రశ్నలు ఇవ్వగా, ప్లానింగ్‌లో 400 మార్కులకు 100 ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నపత్రాలు తేలికగా వచ్చాయని విద్యార్థులు తెలిపారు. గత జనవరితో పోల్చితే ప్రశ్నపత్రాలు ఈసారి కొంత సులువుగానే ఉన్నాయని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డీన్‌ పి.వెంకటేశ్వరరావు, శారదా విద్యాసంస్థ ప్రతినిధి జి.విఘ్నేశ్వరరావు తెలిపారు. గణితంలో ఇచ్చిన 25 ప్రశ్నలలో ఐదారు కొంచెం సాగదీతగా ఉన్నాయని, వీటికి కొంచెం ఎక్కువ సమయం పడుతుందని అన్నారు.
* జాగ్రత్తల నడుమ జేఈఈ మెయిన్స్‌
దిల్లీ: కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్‌ పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పనాజీలో ఏర్పాటు చేసిన ఓ పరీక్ష కేంద్రంలో.. విద్యార్థులు పెట్టుకొచ్చిన మాస్కులను ధ్వంసం చేసి వారికి కొత్త మాస్కులిచ్చి లోపలికి అనుమతించారు. 8,58,273 మంది విద్యార్థులు ఈ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 224 ప్రాంతాల్లో 489 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీ, ఎన్‌ఐటీల్లో బీటెక్‌ ప్రవేశాల నిమిత్తం సెప్టెంబ‌రు 6 వరకు పరీక్షలు జరగనున్నాయి.