• facebook
  • whatsapp
  • telegram

శిక్షణ దూరమై.. సాధన కష్టమై..!

* జేఈఈ మెయిన్‌లో ఆశించిన మార్కులు సాధించలేమంటున్న విద్యార్థులు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, మల్లాపూర్‌: కరోనా ప్రభావంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి.. ఆన్‌లైన్‌ పాఠమే శరణ్యమైంది. విద్యార్థుల సందేహాలు తీరక అభ్యాసం తగ్గింది.. మొత్తంగా ఆ ప్రభావం మార్కుల సాధనపై పడుతోంది. ఆశించిన మార్కులు సాధించలేమోనన్న నిరుత్సాహం అభ్యర్థుల్లో కనిపించింది. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 పరీక్ష సెప్టెంబ‌రు 1న ప్రారంభమైంది. రోజుకు రెండు విడతల చొప్పున సెప్టెంబ‌రు 6వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులతో ‘ఈనాడు’ మాట్లాడగా.. ఆన్‌లైన్‌ శిక్షణతో సరైన ఫలితం కనిపించలేదన్నారు. అధ్యాపకుల పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటే అర్థంకాని విషయాలను మళ్లీ మళ్లీ అడిగి తెలుసుకునే వెసులుబాటు ఉండేదని తెలిపారు. తోటి విద్యార్థులతో బృంద చర్చలు కూడా లేకుండాపోయాయని వాపోయారు. మొదటి విడత పరీక్షలో భౌతికశాస్త్రం, మధ్యాహ్నం రెండో విడత పరీక్షలో రసాయనశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని విద్యార్థులతోపాటు నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బుధవారం జరిగిన రెండు విడతల పరీక్షలకు 12,006 మంది హాజరుకావాల్సి ఉంది. అయితే, జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) విద్యార్థుల హాజరు శాతాన్ని మాత్రం వెల్లడించడం లేదు.
దీర్ఘకాల శిక్షణ తీసుకున్నా..
నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉంటూ శిక్షణ తీసుకున్నా.  ఉదయం విడత పరీక్షలో గణితం, రసాయనశాస్త్రం సులభంగా ఉండటంతో రాయగలిగాను. భౌతికశాస్త్రం కఠినంగా ఉన్న నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా అనిపిస్తోంది. ఏడాదిగా లాంగ్‌టర్మ్‌ శిక్షణ తీసుకున్నా.. కరోనా ప్రభావంతో లక్ష్యం చేరుకోని పరిస్థితి ఏర్పడింది. ఆన్‌లైన్‌ చదువులు పూర్తి ఫలితాలను ఇవ్వవు.
                           -ఎల్‌.భార్గవ్‌, నిజామాబాద్‌ జిల్లా