• facebook
  • whatsapp
  • telegram

హస్తకళల్లో యువతకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు హస్తకళల్లో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనతో పాటు తెలంగాణ హస్తకళల పరిరక్షణలో భాగంగా ఉత్పత్తులను పెంచేందుకు వీలుగా జిల్లాల వారీగా ఈ కార్యక్రమం చేపట్టనుంది. దీనికి అవసరమైన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. తెలంగాణలో 55 హస్తకళలుండగా.. ప్రస్తుతం పది వరకే మనుగడలో ఉన్నాయి. దాదాపు పది వేల మంది వీటిని తయారు చేస్తున్నారు. కరీంనగర్‌లోని ఫిలిగ్రి, పెంబర్తి నకాషీ, నిర్మల్‌ కొయ్యబొమ్మలు, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లాలో డోక్రా, చేర్యాల చిత్రాలు, హైదరాబాద్‌లోని బిద్రి తదితర కళారూపాలను మాత్రమే తయారు చేస్తున్నారు. సుస్థిర ఉపాధి, ఆదాయం లేకపోవడం, నైపుణ్య శిక్షణ లభించకపోవడం వంటి కారణాలతో సంప్రదాయిక కళాకారులు మినహా వారి వారసులు, కొత్తవారు ఈ రంగంలోకి రావడం లేదు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల హస్తకళలపై నిర్వహించిన సమీక్షలో కొత్తగా కళాకారులను తయారు చేయాలని నిర్ణయించారు. దీనికి అనువుగా హస్తకళాభివృద్ధి సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. కేటీఆర్‌ ఆమోదించారు. మొత్తం 33 జిల్లాల్లో హస్తకళల నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రారంభించేందుకు అనుమతించారు. దీనికి బడ్జెట్‌ నిధులను కేటాయించాలని పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.
జనవరి నుంచి శిక్షణ
జిల్లాల్లో భవనాలను ఎంపిక చేసి, జనవరి నుంచి శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతను శిక్షణలో చేరాలని ఆహ్వానిస్తారు. దరఖాస్తుల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.