• facebook
  • whatsapp
  • telegram

నీట్‌గా ముగిసింది

* వచ్చే నెలలో ఫలితాల విడుదల?
ఈనాడు - హైదరాబాద్‌: ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశపరీక్ష(నీట్‌)కు 90 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసిన ఈ పరీక్షకు 55,800 మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 94 శాతం మంది హాజరైనట్లు అధికారులు చెబుతున్నారు.
నీట్‌ను గతేడాది రాష్ట్రంలో 100 కేంద్రాల్లో నిర్వహించగా.. ఈసారి కొవిడ్‌ నేపథ్యంలో 112 సెంటర్లలో నిర్వహించారు. విద్యార్థుల మధ్య వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ.. ఒక్కో గదిలో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్ష రెండుసార్లు(మే 3, జులై 26) వాయిదా పడింది. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నీట్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నట్లు నీట్‌ వర్గాలు తెలిపాయి.
ఉదయం నుంచే సందడి
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్ష సమయం కాగా, కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు.
 అన్ని కేంద్రాల్లోనూ థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలతో అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించారు. శానిటైజర్లు, మాస్కులను అందుబాటులో ఉంచారు.
*  హాల్‌టికెట్లను బార్‌కోడింగ్‌ యంత్రాల ద్వారా పరిశీలించి విద్యార్థులను లోపలికి పంపించారు.
 కొందరు విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రం వద్దకు వచ్చి తడబాటుకు లోనుకావడం అక్కడక్కడా కనిపించింది.
 రాష్ట్రంలో కేవలం 5 జిల్లాల్లోనే పరీక్షా కేంద్రాల ఏర్పాటుతో ప్రజారవాణా పూర్తిస్థాయిలో అందుబాటులో లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
మొత్తంగా చూస్తే సులువే
నీట్‌లో మొత్తంగా అన్ని ప్రశ్నలను పరిశీలిస్తే ఎక్కువగా సులువైనవే వచ్చాయనే అభిప్రాయం కలుగుతోంది. భౌతిక, రసాయన శాస్త్రాల్లో రెండేసి చొప్పన ప్రశ్నలు గందరగోళానికి గురిచేసేవిగా ఉన్నాయి. బోటనీలో రెండూ మూడు ప్రశ్నలు ఇలాగే ఉన్నాయి. మొత్తంగా ఇటువంటివి ఓ 10 వరకూ ఉంటాయి.
- శంకరరావు, విద్యావేత్త
ఎన్‌సీఈఆర్‌టీ ప్రశ్నలే అత్యధికం
బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 180 ప్రశ్నల్ని ఇచ్చారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించారు. దాదాపు 99 శాతం ప్రశ్నలు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) పాఠ్యప్రణాళిక నుంచే వచ్చాయని చెబుతున్నారు.
అర్హత మార్కులు 150!
గత ఏడాది అర్హత మార్కులు 134 ఉండగా.. ఈసారి ప్రశ్నపత్రం సులువుగా రావడంతో ఆ సంఖ్య 150 ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ వైద్యంలో 1,640 ఎంబీబీఎస్‌ సీట్లు, ప్రైవేటు వైద్యకళాశాలల్లో 3,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

 

  • Tags