• facebook
  • whatsapp
  • telegram

16 నుంచి వర్సిటీల చివరి సెమిస్టర్‌ పరీక్షలు

* ఈదఫా విధానంలో కీలక మార్పులు
* రాయనున్న 1.65 లక్షల మంది విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: ఆరు నెలల తర్వాత కళాశాలల్లో సందడి నెలకొననుంది. సెప్టెంబ‌రు 16 నుంచి చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 4 వారాలపాటు వరుస పరీక్షలతో విద్యార్థులు బిజీ కానున్నారు. కరోనా కారణంగా మార్చిలో విద్యాసంస్థలు మూతపడగా తాజాగా పరీక్షలు రాసేందుకు విద్యార్థులు కాలేజీ గడప తొక్కనున్నారు.
జేఎన్‌టీయూలో 16 నుంచి.. ఉస్మానియాలో 17 నుంచి..
జేఎన్‌టీయూ పరిధిలోని బీటెక్‌, బీఫార్మసీ, ఎంబీఏ కోర్సుల్లోని చివరి ఏడాది విద్యార్థులకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉస్మానియా పరిధిలో సెప్టెంబ‌రు 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి పరీక్షల్లో భారీ మార్పులు తీసుకు రావడంతో త్వరగా పరీక్ష రాసేందుకు వీలుంటుంది. కంప్యూటర్‌ సైన్స్‌ వంటి పరీక్షలు కేవలం 3 రోజుల్లోనే ముగించనున్నారు. పలు సెట్‌ల కారణంగా పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు చేశారు.
45 రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు
ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, కొవిడ్‌ లక్షణాలున్నా పరీక్షకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. అలాంటి వారికి 45 రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని జేఎన్‌టీయూ అధికారులు చెప్పారు. ఈమేరకు హైకోర్టుకు మంగళవారం ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులనూ రెగ్యులర్‌గానే పరిగణిస్తారు. ఉస్మానియాలోనూ 2 నెలల్లో మరోసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు.
రవాణాకు ఇబ్బందులు
ప్రస్తుతం విద్యార్థులు సొంతూళ్లలోనే ఉన్నారు. దీంతో పరీక్ష కేంద్రాలను వారు చదువుకున్న కళాశాలలోనే కేటాయించినా ప్రజా రవాణా లేక విద్యార్థులు ఇబ్బందులు పడనున్నారు. సొంత వాహనాలు లేదా ప్రైవేటు వాహనాలపైనే వెళ్లాలి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ కళాశాలలు శివారుల్లోని మారుమూల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వెళ్లి రావాలంటే రవాణా సదుపాయం లేదు.
ఈసారి మార్పులు ఇలా..
* విద్యార్థులు చదివే కళాశాలలోనే పరీక్ష రాయొచ్ఛు * గదికి 10-15 మందే కూర్చుంటారు. * పరీక్షల సమయం 2 గంటలే. * ఛాయిస్‌ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ. * కోర్సుల వారీగా 2 షిఫ్టుల్లో పరీక్షలుంటాయి. * హాజరును ఆన్‌లైన్‌లో తీసుకుంటారు. * జేఎన్‌టీయూలో డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌.
స్వీయ ధ్రువీకరణ తీసుకుంటాం
చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్షలు ప్రారంభమయ్యే ముందు తమకు కొవిడ్‌ లక్షణాలు లేవని, ప్రభుత్వ క్వారంటైన్‌లో లేమని విద్యార్థుల నుంచి స్వీయ ధ్రువీకరణ తీసుకుంటాం. ఆరోగ్యం బాగా లేకపోతే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఉండండి. 
   - వి.కామాక్షి ప్రసాద్‌, జేఎన్‌టీయూ పరీక్షల విభాగం సంచాలకుడు
ఉస్మానియా విశ్వవిద్యాలయం
* పరీక్ష కేంద్రాలు - 300
* మొత్తం విద్యార్థుల సంఖ్య - 1.10 లక్షలు
* డిగ్రీ విద్యార్థులు - 65 వేల మంది
* సాంకేతిక, వృత్తి విద్యా విద్యార్థులు - 20 వేల మంది
* పీజీ విద్యార్థులు - 25 వేల మంది
జేఎన్‌టీయూ
* ఇంజినీరింగ్‌ పరీక్ష కేంద్రాలు - 125
* ఫార్మసీ కేంద్రాలు - 73, ఎంబీఏ కేంద్రాలు - 91
* మొత్తం విద్యార్థుల సంఖ్య - 55 వేలు.
* ఇంజినీరింగ్‌ విద్యార్థులు - 45 వేల మంది
* ఫార్మసీ విద్యార్థులు - 5 వేల మంది
* ఎంబీఏ విద్యార్థులు - 5 వేల మంది