• facebook
  • whatsapp
  • telegram

హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలపై రగడ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షల తేదీలు మార్చాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సెప్టెంబ‌రు 24-26 మధ్య పరీక్షలు నిర్వహించాలని వర్సిటీ నిర్ణయించింది. అన్ని యూనివర్సిటీలు చివరి సెమిస్టర్‌ పరీక్షల నేపథ్యంలో వాటితోపాటు హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలూ రాయాలంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని విద్యార్థులంటున్నారు. ఈసారి హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షకు 62,853 దరఖాస్తులు అందాయి. ఇందులో 46 శాతం దరఖాస్తులు తెలంగాణ నుంచే ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ సైతం హెచ్‌సీయూ ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని వీసీకి లేఖ రాసినట్లు చెప్పారు. అయితే వాయిదాపై ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన లేదని వీసీ ప్రొ.పొదిలె అప్పారావు స్పష్టం చేశారు. అక్టోబరు ద్వితీయార్థంలో ప్రవేశ పరీక్షలు పెట్టాలని టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ప్రతిపాదించగా వర్సిటీ అధికారులు అంగీకరించలేదు.