• facebook
  • whatsapp
  • telegram

సింగరేణి మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పరీక్ష ఫలితాల విడుదల

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: సింగరేణిలోని అన్ని ఏరియాల పరిధిలో 86 ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి మార్చి 1న నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను యాజమాన్యం సెప్టెంబ‌రు 19న‌ విడుదల చేసింది. ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని 36 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 8,747 మంది హాజరయ్యారు. ఆ రోజున పరీక్ష రాసేందుకు వచ్చిన 12 మంది నకిలీ అభ్యర్థులతో పాటు వారిని పంపిన బిహార్‌, హరియాణా రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులు కొందరిని కొత్తగూడెం, పాల్వంచ పరీక్ష కేంద్రాల నిర్వాహకులు పట్టుకున్నారు. ఈ సంఘటనపై మణుగూరు ఏఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దోషులపై చట్టపరమైన చర్యలను తీసుకోవడంతో నిబంధనలకు లోబడి ఫలితాలను వెల్లడించవచ్చని సింగరేణికి పోలీసు శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం ప్రధాన కార్యాలయంలోని నోటీసు బోర్డుపై సెప్టెంబ‌రు 19 రాత్రి 7 గంటలకు రాత పరీక్షల ఫలితాలను ప్రదర్శించినట్లు జీఎం (పర్సనల్‌) ఆనందరావు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ‘ఎస్‌సీసీఎల్‌.కామ్‌’ వెబ్‌సైట్లోనూ చూడొచ్చని సూచించారు.