• facebook
  • whatsapp
  • telegram

తెలంగాణలో 17,900 టీచర్‌ పోస్టుల ఖాళీ

ఈనాడు, దిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 52,788 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, జీఎస్టీ ఎగవేతలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగానే ఉన్నట్టు కేంద్ర మంత్రులు వెల్లడించారు. సెప్టెంబ‌రు 19న లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు ఈ మేరకు వారు సమాధానమిచ్చారు. ‘దేశంలోని 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు 61,84,467 ఉపాధ్యాయ పోస్టులు మంజూరుచేయగా, ప్రస్తుతం 10,60,139 (17.14%) ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో 1,40,902 పోస్టులకుగాను 17,900 (12.70%), ఆంధ్రప్రదేశ్‌లో 2,46,552 పోస్టులకుగాను 34,888 (14.15%) భర్తీకి నోచుకోలేదు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ అనేది నిరంతర ప్రక్రియ. పదవీ విరమణ, విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ అదనపు నియామకాలు అవసరం అవుతాయి. ఖాళీలూ పెరుగుతూ పోతాయి’ అని విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ విశ్లేషించారు. విద్య ఉమ్మడి జాబితాలోకి వస్తుందని, నియామకాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుందన్నారు.
* జేఈఈ హాజరులో రాష్ట్రమే ప్రథమం
జేఈఈ పేపర్‌-1 పరీక్షకు దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి 85.73 శాతం (50,360) మంది హాజరయ్యారని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు.  లోక్‌సభలో జహీరాబాద్‌, చేవెళ్ల, రాజమండ్రి ఎంపీలు బి.బి.పాటిల్‌, డాక్టర్‌ జి.రంజిత్‌రెడ్డి, భరత్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జేఈఈ పేపర్‌-2 పరీక్షకు తెలంగాణ నుంచి 5,356 (62.40 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 2020-21 విద్యాసంవత్సరాన్ని జీరో ఇయర్‌గా మార్చబోమని ఆయన తెలిపారు.