• facebook
  • whatsapp
  • telegram

పరీక్షల సందడి!

* విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కొన్ని..
* డిగ్రీ, పీజీలలో ఉత్తీర్ణతకు మరికొన్ని..
* ఉద్యోగార్థులకూ పలు రకాల పరీక్షలు
* కరోనా జాగ్రత్తలతో నిర్వహణ

ఈనాడు, అమరావతి: కరోనా వ్యాప్తితో వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు మొదలయ్యాయి. అసలు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా.. లేదా? ఉద్యోగాల భర్తీ ఉంటుందా.. లేదా? అన్న ఆందోళనలో ఉన్నవారికి ఈ పరీక్షల నిర్వహణ కాస్త ఉపశమనం కలిగిస్తోంది. పరీక్ష కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నా వెలుపల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థుల మధ్య దూరం కనిపించడం లేదు. కొందరు మాస్కులూ పెట్టుకోవడం లేదు. దీనివల్ల కరోనా విస్తరించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ పరీక్షలే..
సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 82వేల మంది ఈ పరీక్షలు రాశారు. వీటి ఫలితాలూ వెలువడ్డాయి. సెప్టెంబ‌రు 13న‌ వైద్య విద్యలో ప్రవేశాలకు పరీక్షలు జరిగాయి. వీటికి రాష్ట్రం నుంచి గతేడాది 57,755 దరఖాస్తులు రాగా, ఈసారి 61,892 మంది దరఖాస్తు చేశారు. ఫలితాలు రావాలి. ఏపీ ఎంసెట్‌, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు 4.37 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఐసెట్‌, ఈసెట్‌ పరీక్షలు పూర్తికాగా.. సెప్టెంబ‌రు 17 నుంచి ప్రారంభమైన ఎంసెట్‌ 25 వరకు జరగనుంది. 2019-20 విద్యా సంవత్సరం డిగ్రీ, పీజీ, బీటెక్‌, పాలిటెక్నిక్‌ చివరి సంవత్సరం సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
వైద్య, పారా మెడికల్‌ విద్యార్థులకు..
ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ వైద్య, బీడీఎస్‌ పరీక్షలు ముగిశాయి. ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. సెప్టెంబ‌రు 29 నుంచి బీఎస్సీ నర్సింగ్‌ చివరి సంవత్సరం, పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌, బీఎస్సీ ఎంఎల్టీ చివరి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు, బీఎస్సీ పారా మెడికల్‌ మొదటి సంవత్సరం, బీడీఎస్‌ చివరి సంవత్సరం (రెగ్యులర్‌) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబరు 1 నుంచి ఎంఎస్సీ నర్సింగ్‌ ప్రథమ, చివరి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు, 6 నుంచి ఆయుర్వేద, యునానీ, హోమియో, నేచురోపతి చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇలా అక్టోబరు 26 వరకు పరీక్షల నిర్వహణకు విశ్వవిద్యాలయం సిద్ధమైంది.
సందేహాల నివృత్తికి బడికి..
సెప్టెంబ‌రు 21 నుంచి 9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థులు సందేహాల నివృత్తి కోసం ఉపాధ్యాయులను విద్యా సంస్థల్లో కలుసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే పాఠశాలల్లో ప్రవేశాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇలా విద్యాసంస్థలు, పరీక్షా కేంద్రాలు విద్యార్థులు, అభ్యర్థులతో కళకళలాడుతున్నాయి.
కరోనా నుంచి రక్షణ
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా పరీక్షల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌-19 లక్షణాలున్న వారి కోసం ప్రత్యేకంగా ఐసొలేషన్‌ గదులను ఏర్పాటుచేస్తున్నారు. ఈ గదుల్లోని ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లు ఇస్తున్నారు. విద్యార్థులు గుమిగూడకుండా ఉండేందుకు, వారికి సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు.  విద్యార్థుల హాల్‌టికెట్లపై ఉండే బార్‌కోడ్‌ను స్కాన్‌చేసి పరీక్ష గదుల సమాచారం అందిస్తున్నారు. గతంలోలా నోటీసు  బోర్డుల ఏర్పాటు లేదు. జేఈఈ మెయిన్స్‌ రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో మాస్కులు అందించారు. పరీక్ష కేంద్రం ఆవరణలోకి ప్రవేశించే ముందే అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతను థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా గుర్తిస్తున్నారు. జ్వరం ఉన్నవారిని వేరే గదుల్లో ఉంచి పరీక్షలు రాయిస్తున్నారు. వైరస్‌ సోకి, చికిత్స పొందిన అభ్యర్థులు నెగెటివ్‌ రిపోర్టు తీసుకురావాలని ఏపీపీఎస్సీ సూచిస్తోంది.
సచివాలయ ఉద్యోగాల భర్తీ పరీక్షలు
రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబ‌రు 20 (ఆదివారం) నుంచి 26 వరకు 16,208 సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు జరగబోతున్నాయి. 13 రకాల పోస్టుల భర్తీకి 10.56 లక్షల మంది దరఖాస్తు చేశారు. కరోనా వ్యాప్తి తర్వాత లక్షల సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలు రాయడం ఇదే ప్రథమం.
రేపటి నుంచి ఏపీపీఎస్సీ
సెప్టెంబ‌రు 21 నుంచి ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గెజిటెడ్‌ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు విజయవాడలో జరగనున్నాయి. నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలకూ సెప్టెంబ‌రు 25 నుంచి 27 వరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. సెప్టెంబ‌రు 15న డిగ్రీ కళాశాలల అధ్యాపకుల నియామక ప్రధాన రాతపరీక్ష జరిగింది. 76.07% మంది అభ్యర్థులు హాజరయ్యారు.
డిసెంబరులో రైల్వే పరీక్షలు
రైల్వేశాఖ ఇప్పటికే ప్రకటించిన 1.40 లక్షల ఉద్యోగాల భర్తీకి 2.40 కోట్ల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్షలను డిసెంబరులో నిర్వహించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. జేఈఈ నిర్వహణ అనుభవంతో ఈ పరీక్షలకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.