• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ సిలబస్‌ 30 శాతం తగ్గింపు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పాఠ్య ప్రణాళికను ఈ విద్యాసంవత్సరం(2020-21) 30 శాతం తగ్గించారు. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బోర్డు ప్రతిపాదనకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తొలగించిన పాఠ్యాంశాల వివరాలను ఇంటర్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో దాదాపు రెండు నెలల క్రితమే 30 శాతం సిలబస్‌లో కోత విధిస్తూ సీబీఎస్‌ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకు సంబంధించి సీబీఎస్‌ఈ తొలగించిన పాఠ్యాంశాలను ఇక్కడా తొలగించామని బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఇతర ఆర్ట్స్‌ గ్రూపు సబ్జెక్టులైన చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతి శాస్త్రం, జాగ్రఫీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, కామర్స్‌, అకౌంటెన్సీ సిలబస్‌పై నిపుణుల కమిటీలను నియమించి వాటి సిఫార్సుల ఆధారంగా తగ్గించామని పేర్కొన్నారు. ఈ తగ్గింపు ఈ ఒక్క విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందన్నారు. ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్‌ (tsbie.cgg.gov.in) లో తొలగించిన ఆయా పాఠ్యాంశాలను ఉంచామని  తెలిపారు.
టీపీఎస్‌, 8 సూత్రాల పథకం పాఠాల తొలగింపు
ప్రతి సబ్జెక్టులో అధ్యాయాల వారీగా ఆయా పాఠ్యాంశాలను తొలగించారు. ద్వితీయ సంవత్సరం చరిత్రలో మర్రి చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి(టీపీఎస్‌), ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎనిమిది సూత్రాల పథకంతో పాటు ప్రజాదరణ పొందిన జాతరలు తదితర పాఠ్యాంశాలు ఉండవు.

  • Tags