• facebook
  • whatsapp
  • telegram

పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు

* టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి
* గవర్నర్‌కు 2018-19 వార్షిక నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) ద్వారా ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించేందుకు పలు సంస్కరణలు చేపట్టామని ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి.. గవర్నర్‌ తమిళిసైకి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ 2018-19 వార్షిక నివేదికను చక్రపాణి  సెప్టెంబరు 23న  దృశ్యమాధ్యమంలో గవర్నర్‌కు సమర్పించారు. అందుబాటులో ఉన్న వనరులతో ఎలాంటి అభియోగాలు లేకుండా టీఎస్‌పీఎస్సీ నియామకాలు జరపడం అభినందనీయమని గవర్నర్‌ అన్నారు. టీఎస్‌పీఎస్సీ ఆవిర్భావం తర్వాత 2015 జులై నుంచి ఇప్పటి వరకు 31,002 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తిచేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. ‘‘39,952 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించగా.. 36,665 నియామకాలకు 107 నోటిఫికేషన్లు జారీచేశాం. మరో 3,287 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. నియామక ప్రక్రియ చేపట్టిన వాటిలో 31,002 నియామకాలు పూర్తయ్యాయి. మరో 5,663 పోస్టులపై వివిధ కేసుల్లో న్యాయస్థానాల్లో స్టే ఉంది’’ అని చక్రపాణి తెలిపారు.

  • Tags