• facebook
  • whatsapp
  • telegram

భౌతికశాస్త్రమే మళ్లీ భయపెట్టింది

* 396 మార్కులకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌
ఈనాడు, అమరావతి, హైదరాబాద్‌: లక్షలాది విద్యార్థుల కలల పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సమయం తీసుకునే ప్రశ్నలే ఈసారి ఎక్కువగా వచ్చాయి. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ పరీక్షలో అత్యధిక శాతం విద్యార్థులకు నిర్ణీత వ్యవధిలో అన్నింటికి జవాబులు గుర్తించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా భౌతికశాస్త్రం ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. గణితం మధ్యస్థంగా ఉంది. ఉదయం నిర్వహించిన పేపర్‌-1 కంటే మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 ప్రశ్నలు సులభంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా జరిగిన అడ్వాన్స్‌డ్‌ పేపర్‌-1కు 1,51,311 మంది, పేపర్‌-2కు 1,50,900 మంది హాజరయ్యారు. రెండు పరీక్షలు రాస్తేనే హాజరైనట్టు పరిగణిస్తారు. అంటే ఈ పరీక్ష రాసినవారు 1,50,900 మందే. 96 శాతం మంది హాజరయ్యారని ఐఐటీ దిల్లీ సంచాలకులు ఆచార్య వి.రాంగోపాల్‌రావు తెలిపారు. రెండు పేపర్లు కలిపి మొత్తం 396 మార్కులు. జనరల్‌ కేటగిరీకి 35 శాతమంటే 139 మార్కులు కటాఫ్‌ కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓబీసీలకు 30, ఎస్సీలకు 15 శాతం కటాఫ్‌ ఉంటుందని భావిస్తున్నారు.
వారంలోనే ర్యాంకులు: అక్టోబరు 5న అంటే.. కచ్చితంగా వారంలోనే ర్యాంకులు ప్రకటించనున్నారు. కటాఫ్‌ మార్కులు సాధించిన వారు మాత్రమే ఐఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. ఐఐటీల్లో దాదాపు 13,600 సీట్లుండగా దానికి కనీసం మూడు రెట్లు విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఎంపిక చేస్తారు. దాదాపు 41 వేల మంది హాజరయ్యేందుకు అవకాశం ఉంది. అక్టోబరు 6 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది.

Posted Date : 28-09-2020 .