• facebook
  • whatsapp
  • telegram

ఐఐటీల్లో కొత్త కోర్సుల జోరు!

* ఐఐటీహెచ్‌లో బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌
* తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌సీ కోర్సులు
* 300కు పైగా పెరగనున్న బీటెక్‌ సీట్లు

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా కారణంగా విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారినా దేశంలోని 23 ఐఐటీలు కోర్సులు, సీట్లు పెంచేందుకు సిద్ధమయ్యాయి. గత ఏడాది బాలికలకు 17 శాతం సూపర్‌ న్యూమరీ సీట్లను కేటాయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా అది 18 శాతానికి పెరిగిన నేపథ్యంలో ఈసారి 20 శాతం సీట్లు అమ్మాయిలకు కేటాయించాలని నిర్ణయించాయి. అందుకు అనుగుణంగా పెరిగేవి, కొత్తకోర్సులతో అందుబాటులో వచ్చేవి కలిపి దాదాపు 300లకుపైగా సీట్లు పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది అన్ని ఐఐటీల్లో కలిపి 13,674 సీట్లు ఉండగా, ఈసారి అది 14 వేలు దాటనుందని ఐఐటీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం సీట్ల సంఖ్యపై వచ్చే నెల ఆరో తేదీన స్పష్టత రానుంది. తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసిన వారికి ఇది అదనపు ప్రయోజనం కానుంది.
కొన్ని ఐఐటీల్లో కొత్త కోర్సులు 
ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్‌ బయో మెడికల్‌ ఇంజినీరింగ్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తున్నారు. అందులో 30 సీట్లు ఉంటాయి. కరోనా కారణంగా వైద్య రంగంలో వెంటిలేటర్లు, ఇతర పరికరాలపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందుకే ఈ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీహెచ్‌ సంచాలకులు మూర్తి చెప్పారు. ఎంటెక్‌లో ‘ఈ-వేస్ట్‌ రీసోర్స్‌’ లాంటి పలు కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు.
* ఐటీ దిల్లీ బీటెక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యుటేషనల్‌ మెకానిక్స్‌ను ప్రారంభిస్తోంది.
* ఐఐటీ మద్రాస్‌ ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌లో బీఎస్‌సీ ప్రోగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్టోబరులో నెల రోజులపాటు కోర్సు నడిపి అసైన్‌మెంట్‌ ఇస్తారు. ఆ తర్వాత పరీక్ష రాయాలి. అందులో అర్హత సాధించిన వారికి సీటు ఇస్తారు. జనవరి నుంచి ఈ కోర్సు తరగతులు మొదలవుతాయి.
* తిరుపతిలో ఈసారి ఎంఎస్‌సీ రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం కోర్సులకు శ్రీకారం చుడుతున్నట్లు ఆ సంస్థ సంచాలకుడు ఆచార్య ఎస్‌.ఎన్‌.సత్యనారాయణ చెప్పారు.
రెండింటిలో డిజైన్‌ కోర్సులు
ఐఐటీ హైదరాబాద్‌తోపాటు ఐఐటీ దిల్లీ బ్యాచులర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడెస్‌) కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఇందులో ప్రవేశం పొందాలంటే యుసీడ్‌ (అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇన్‌ డిజైన్‌)లో అర్హత సాధించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో 20, దిల్లీలో 40 సీట్లు కొత్తగా రానున్నాయి.

Posted Date : 29-09-2020 .