• facebook
  • whatsapp
  • telegram

6న తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు అక్టోబరు 6న వెల్లడి కానున్నాయి. ముందుగా 5న విడుదల చేయాలని భావించినా అదేరోజు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులు కూడా వెల్లడవుతున్నందున ఆరో తేదీన ఎంసెట్‌ ర్యాంకులు ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 1,19,187 మంది హాజరయ్యారు. యూజీసీ ఆదేశాల ప్రకారం నవంబరు 1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంది. అక్టోబరు రెండో వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు.
3న కరోనా బాధిత విద్యార్థులకు పరీక్ష
ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరిగినప్పుడు కరోనాతో బాధపడిన సుమారు 53 మంది విద్యార్థులకు అక్టోబరు 3న జేఎన్‌టీయూహెచ్‌లో పరీక్ష నిర్వహిస్తామని పాపిరెడ్డి వెల్లడించారు. అదేరోజు మరో ముగ్గురు ఈసెట్‌ విద్యార్థులకూ పరీక్ష ఉంటుందన్నారు. మిగిలిన పరీక్షల సమయంలోనూ బాధిత విద్యార్థులుంటే ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు.
ఎంసెట్‌ అగ్రికల్చర్‌కు 63,857 మంది హాజరు
తెలంగాణ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు సెప్టెంబరు 29న ముగిశాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి రెండు రోజుల్లో మొత్తం 78,978 మందికి గాను 63,857 మంది (80.85 శాతం) పరీక్ష రాశారు.

Posted Date : 30-09-2020 .