• facebook
  • whatsapp
  • telegram

ఆరేళ్లలో భర్తీచేసిన కొలువులు 29,091

ఈనాడు, హైదరాబాద్‌:  తెలంగాణ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు (సెప్టెంబరు 25వ తేదీ వరకు) ఆరేళ్ల కాలంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా 29,091 ఉద్యోగాలు భర్తీ చేశారు. వెయిటేజీ మార్కులు/కోర్టు కేసులతో మరో 5,916 కొలువులకు సంబంధించిన నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడికి టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన వివరాలివి. ఉద్యోగాల కోసం 2014 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 49,07,616 మంది దరఖాస్తు చేసుకున్నట్లు కమిషన్‌ వెల్లడించింది. న్యాయస్థానాల్లో కేసులతో భర్తీ ఆగిపోయిన వాటిలో గురుకులాల్లో  616 పీఈటీలు, 303 ప్రిన్సిపల్‌, వైద్య విద్యలో 167 సహాయ ఆచార్యులు, పాఠశాల విద్యా శాఖలో 158 హిందీ స్కూల్‌ అసిస్టెంట్లు, వైద్య ఆరోగ్య శాఖలో 3,311 స్టాఫ్‌ నర్సులు, 325 ల్యాబ్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌ - 2, 342 హిందీ పండిత్‌, 36 ఫుడ్‌ సేఫ్టీ అధికారులు.. తదితర పోస్టులు ఉన్నట్లు తెలిపింది.
ఇతర వివరాలు 
* టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన కొలువుల సంఖ్య: 39,952
* ఇప్పటి వరకు జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలు: 143
* ఎంపికకు తుది దశలో ఉన్నవి: 1636

Posted Date : 30-09-2020 .