• facebook
  • whatsapp
  • telegram

అనుమతి పొందిన కాలేజీలను కౌన్సెలింగ్‌లో చేర్చాలి

* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ కోర్సుల నిర్వహణకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి పొందిన కాలేజీలను రెండో విడత వెబ్‌కౌన్సెలింగ్‌లో చేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఏఐసీటీఈ అనుమతి ఉన్నప్పటికీ తమను కౌన్సెలింగ్‌లో చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ పలు పాలిటెక్నిక్‌ కాలేజీలు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై విచారించిన సింగిల్‌ జడ్జి కాలేజీల వినతి పత్రాలపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. సెప్టెంబరు 30 నుంచి కౌన్సెలింగ్‌ మొదలవుతుందంటూ సింగిల్‌ జడ్జి ఆదేశాలపై కాలేజీలు అప్పీళ్లు దాఖలు చేశాయి. వీటిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది సి.వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. మంగళవారమే జీవోలు జారీ చేయనుందని చెప్పారు. దీంతో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని అప్పీళ్లపై ధర్మాసనం విచారణను ముగించింది.

Posted Date : 30-09-2020 .