• facebook
  • whatsapp
  • telegram

ఒక్క విద్యార్థిని కూడా ఆన్‌లైన్‌ తరగతులకు నిరాకరించొద్దు

* ప్రైవేటు పాఠశాలలకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఫీజులు చెల్లించలేదని ఒక్క విద్యార్థిని కూడా ఆన్‌లైన్‌ తరగతులకు నిరాకరించొద్దంటూ ప్రైవేటు పాఠశాలలను  సెప్టెంబరు 30న హైకోర్టు ఆదేశించింది. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్‌నూ నిరాకరించరాదనీ, విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ, రెండు పక్షాల వాదనలు విన్న తర్వాత నిర్ణయం వెలువరిస్తామనీ పేర్కొంది. తల్లిదండ్రులు దాఖలు చేసిన అప్పీలులో కౌంటరు దాఖలు చేయాలంటూ సికింద్రాబాద్‌లోని సెయింట్‌ లూయీస్‌, బోయినపల్లిలోని సెయింట్‌ ఆండ్రూస్‌, సెయింట్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46కు విరుద్ధంగా ఈ పాఠశాలలు ఫీజులు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ శారద షా మరికొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి.. వార్షిక ఫీజుల్లో 50 శాతం, నెలవారీ ఫీజులు చెల్లించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తల్లిదండ్రులు అప్పీలు దాఖలు చేయగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్‌ జడ్జి వద్ద మరో పిటిషన్‌ ఇలాంటిదే పెండింగ్‌ ఉందని, దాన్ని దీంతో జతచేసి వినాలని పాఠశాల తరఫు న్యాయవాది అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ అప్పీలుపై విచారణ చేపడతామని, అభ్యంతరాలుంటే కౌంటరు దాఖలు చేయవచ్చని పేర్కొంది. అయితే, 50 శాతం ఫీజు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావద్దనీ, ఆన్‌లైన్‌ తరగతులకు నిరాకరించరాదనీ, పదో తరగతి పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలనీ సెయింట్‌ ఆండ్రూస్‌, సెయింట్‌ లూయీస్‌ పాఠశాల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది.

Posted Date : 01-10-2020 .