• facebook
  • whatsapp
  • telegram

దేశవ్యాప్తంగా 82,926 ఎంబీబీఎస్‌ సీట్లు

* అఖిల భారత కోటాలో 6,140
* రాష్ట్రం నుంచి 346 కేటాయింపు

ఈనాడు, అమరావతి: దేశవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరానికి (2020-21) సంబంధించి 82,926 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అఖిల భారత కోటా కింద 6,140 సీట్లు ఉంటాయి. ఏపీ నుంచి 346, తెలంగాణ నుంచి 261 సీట్లు ఈ కోటాలో చేరాయి. కొత్త విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలను రాష్ట్రాలవారీగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దేశంలో 278 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 42,729 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా.. మిగిలినవి ప్రైవేట్‌ వైద్య కళాశాలలు, డీమ్డ్‌ వర్సిటీల్లో అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా  సెప్టెంబ‌రు 13న జరిగిన నీట్‌ (జాతీయ అర్హత పరీక్ష)ను రాసేందుకు 15.97 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఏపీ నుంచి దరఖాస్తు చేసినవారు 61,892 మంది ఉన్నారు. 85-90% మంది ఈ పరీక్ష రాసి ఉంటారని అంచనా. 2019-20 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసిన వారిలో 92.9% మంది పరీక్ష రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 30 ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో కలిపి 5,160 సీట్లు ఉన్నట్లు ప్రకటించింది. రెండేళ్ల నుంచి అఖిల భారత కోటాలో రాష్ట్రం చేరింది. ఏపీ నుంచి 346 సీట్లు ఇవ్వడం వల్ల రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో 6,140 సీట్లకు పోటీపడేందుకు అర్హత లభించింది.
ఈడబ్ల్యూఎస్‌ కింద 335 సీట్లు!
రాష్ట్రంలోని 12 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లలో 15% జాతీయ కోటాకు అప్పగించారు. 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 2,185 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈడబ్ల్యూఎస్‌ కింద కేటాయించిన 335 (10%) సీట్లు ఉన్నాయి. తిరుపతి శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. ఇందులో 25 సీట్లను ఈడబ్ల్యూఎస్‌ కింద, మరో 23 సీట్లను ఎన్నారై కోటా కింద కేటాయించారు. ఈ కళాశాలలో వార్షిక ఫీజు 20 వేల డాలర్లతో ఎన్నారై సీట్ల భర్తీ జరగనుంది. 17 ప్రైవేట్‌ వైద్య కళాశాలలు ఉండగా.. ఇందులో రెండు ముస్లిం మైనార్టీ కళాశాలలు వీటిల్లో కన్వీనర్‌ కోటా (ఎ కేటగిరి) కింద 1,325, ‘బి’ కేటగిరి కింద 921, ‘సి’ కేటగిరిలో 404 సీట్లు చొప్పున ఉంటాయి.
19 వేల దరఖాస్తులు!
2019-20 విద్యా సంవత్సరంలో ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం చేపట్టిన ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో, యునాని, నేచురోపతి-యోగా కోర్సుల్లో ప్రవేశాల కోసం కన్వీనర్‌, యాజమాన్య కోటా కింద కలిపి 19 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.

Posted Date : 02-10-2020 .