నవంబరు 2 నుంచి పాఠశాలలు!

9, 10 తరగతుల విద్యార్థులకు అవకాశం
విద్యాశాఖ యోచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నవంబరు 2 నుంచి పాఠశాలలను తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది. అక్టోబ‌రు 15 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని, దానిపై తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాఠశాలలను, వసతిగృహాలను తెరవడంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీసీ, ఎస్సీ- మైనార్టీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌లు అక్టోబ‌రు 7న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమావేశమై చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించి.. ఆయన ఆమోదంతో నవంబరు 2 నుంచి పాఠశాలల్లో 9, 10 తరగతులతో పాటు జూనియర్‌, ఇతర కళాశాలలు తెరవాలని విద్యాశాఖ భావిస్తోంది. అదేరోజు తెలంగాణ రాష్ట్ర గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ప్రతినిధులతో చర్చించి వారి అభిప్రాయాలనూ తీసుకోనున్నారు.

Posted Date : 04-10-2020 .