• facebook
  • whatsapp
  • telegram

కఠినంగా సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష

* భూగోళశాస్త్రం, ఆర్థికం, పర్యావరణం, చరిత్రపై అధిక ప్రశ్నలు
* రాష్ట్రంలో 45.32% మంది హాజరు

ఈనాడు, హైదరాబాద్‌: సివిల్‌ సర్వీస్‌  ప్రాథమిక పరీక్షలో ప్రశ్నలు కఠినంగా.. ఊహించని విధంగా ఉన్నాయని అభ్యర్థులు, నిపుణులు అభిప్రాయపడ్డారు. ఊహించిన ప్రశ్నలు దాదాపూ రాలేదని శిక్షణ సంస్థల నిర్వాహకులూ అంగీకరిస్తున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత జరుగుతున్న పరీక్ష అయినందున కరోనా సంబంధిత ప్రశ్నలు రెండుమూడైనా రావొచ్చని అభ్యర్థులు భావించినా ఒక్కటీ కనిపించలేదని చెబుతున్నారు. ‘‘నేరుగా వర్తమాన వ్యవహారాలకు సంబంధించి కనీసం ఒక్క ప్రశ్న కూడా రాలేదు. అత్యధికంగా ఆర్థికం, చరిత్ర, రాజనీతి శాస్త్రం(పాలిటీ) తదితర అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. అభ్యర్థి విశ్లేషణ శక్తి కంటే సమాచారం ఎంత తెలుసో అన్న దానిపై లోతుగా.. సాంకేతికంగా అడిగారు’’ అని నిపుణులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన సివిల్‌ సర్వీస్‌-2020 ప్రాథమిక పరీక్షకు తెలంగాణ రాష్ట్రం నుంచి 23,970 మంది హాజరయ్యారు. మొత్తం దరఖాస్తుదారుల(52,879 మంది)తో పోలిస్తే పరీక్ష రాసిన వారు 45.32% మాత్రమే కావడం గమనార్హం. వరంగల్‌లో 6,758 మందికి 3,301 మంది, హైదరాబాద్‌లో 46,121 మందికి 20,669 మంది పరీక్ష రాశారు.
వ్యవసాయం, ఆర్థికం, పర్యావరణంపై ప్రత్యేక పరీక్ష రాసినట్లుగా ఉందని లంగర్‌హౌజ్‌లోని కేంద్రీయ విద్యాలయలో పరీక్ష రాసిన ఒక అభ్యర్థి చెప్పారు. పథకాలు, నివేదికలు, రక్షణ, విద్య, భద్రత తదితర ఎన్నో అంశాలపై ప్రశ్నలు లేవని నల్గొండ నుంచి హైదరాబాద్‌ వచ్చి పరీక్ష రాసిన భరద్వాజ్‌ అనే అభ్యర్థి చెప్పారు.
కృత్రిమ మేధ.. బ్లాక్‌చైన్‌ టెక్నాలజీపై ప్రశ్నలు
ఐటీకి సంబంధించి ఆధునిక సాంకేతికతలైన కృత్రిమ మేధ, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీలపై ప్రశ్నలు ఇచ్చారు. కృత్రిమ మేధ ప్రస్తుతం ఏ రంగాల్లో ప్రభావం చూపుతోంది? బ్లాక్‌చైన్‌ సాంకేతికతకి సంబంధించి ఈ కిందవి ఏవి సరైనవంటూ ప్రశ్నలు అడిగారు.
 

Posted Date : 05-10-2020 .