• facebook
  • whatsapp
  • telegram

అక్టోబ‌రు 9 నుంచి తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

* 12 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
* 22న తొలి విడత సీట్ల కేటాయింపు


ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ అక్టోబ‌రు 9వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కౌన్సెలింగ్‌ను రెండు విడతలుగా నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఆధ్వర్యంలో అక్టోబ‌రు 5న సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, క్యాంప్‌ అధికారి బి.శ్రీనివాస్‌ ఆన్‌లైన్‌ ద్వారా సమావేశమై ఎంసెట్‌ కాలపట్టికను ఖరారు చేశారు. ఇంటర్‌లో ఎంపీసీ చదివి ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ రాసిన విద్యారులు ఈ కౌన్సెలింగ్‌ ద్వారా బీటెక్, బీఫార్మసీలో సీట్లు పొందొచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సీట్లను, ప్రైవేట్‌ కళాశాలల్లో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద ఈ కౌన్సెలింగ్‌ల ద్వారా భర్తీ చేస్తారు. ఈసారి మొదటి, చివరి కౌన్సెలింగ్‌ల‌తోపాటు స్పాట్‌ ప్రవేశాల వివరాలను ముందుగానే వెల్లడించడం విశేషం. ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్, బీఫార్మసీ స్పాట్‌ అడ్మిషన్లకు నవంబరు 4న మార్గదర్శకాలు జారీ చేస్తారు.

మొదటి విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక
* 9-17వ తేదీ వరకు: ఆన్‌లైన్‌లో సమాచారం పూర్తి చేయడం, ధ్రువపత్రాల పరిశీలనకు తేదీ, సమయాన్ని అభ్యర్థులు ఎంచుకోవాలి.
* 12-18వ తేదీ వరకు: ధ్రువపత్రాల పరిశీలన
* 12-20వ తేదీ వరకు: వెబ్‌ ఆప్షన్లు
* 22వ తేదీ: సీట్ల కేటాయింపు
* 22-27వ తేదీ వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌

రెండో విడత కౌన్సెలింగ్‌ కాలపట్టిక
* 29వ తేదీ: తొలి విడతలో హాజరుకాని వారు ధ్రువపత్రాల బుకింగ్‌ కోసం స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి.
* 30వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన
* నవంబరు 2న: సీట్ల కేటాయింపు
* 2-5వ తేదీ వరకు: ట్యూషన్‌ ఫీజు చెల్లించడం, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడం

Posted Date : 06-10-2020 .