• facebook
  • whatsapp
  • telegram

పాఠశాల అణువణువూ పరిశుభ్రం

* పిల్లలు, ఉపాధ్యాయులు నిరంతరం మాస్క్‌లు ధరించాలి
* భౌతిక దూరానికి అనుగుణంగా సీట్లు ఉండాలి
* డాక్టర్లు, వైద్యసిబ్బంది అందుబాటులో ఉంచుకోవాలి
* ప్రామాణిక నిబంధనలు విడుదల చేసిన కేంద్రం

ఈనాడు, దిల్లీ: అక్టోబరు 15 తర్వాత పాఠశాలలు తెరచుకునే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ సమయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిబంధనలను విడుదల చేసింది. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల ప్రాంగణంలోని అణువణువునూ శుభ్రం చేయాలని పేర్కొంది. పిల్లలు, ఉపాధ్యాయులు.. పాఠశాలకు వచ్చిన దగ్గరి నుంచి బయటికెళ్లేంత వరకూ నిరంతరం మాస్కులు ధరించే ఉండాలని స్పష్టం చేసింది. ఫంక్షన్లు, ఈవెంట్లలాంటి కార్యక్రమాల జోలికి పోవద్దని పేర్కొంది. పిల్లలు ఇంట్లో ఉండే చదువుకుంటామని చెబితే అందుకు అంగీకరించాలని స్పష్టం చేసింది. అక్టోబరు 15 తర్వాత పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు తెరవడంపై దశలవారీగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌పోఖ్రియాల్‌ రాష్ట్రాలకు సూచించారు.
ప్రామాణిక నిబంధనలు..
* పాఠశాలలో అన్ని ప్రాంతాలు, ఫర్నీచర్‌, పరికరాలు, స్టేషనరీ, స్టోరేజీ స్థలాలు, నీళ్ల ట్యాంకులు, కిచెన్‌, క్యాంటీన్లు, మరుగుదొడ్లు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు అన్నీ సంపూర్ణంగా డిస్‌ఇన్‌ఫెక్ట్‌ చేయాలి.
* ఎమర్జెన్సీ కేర్‌/రెస్పాన్స్‌ టీంలు, సపోర్ట్‌ టీమ్‌లు, కమాడిటిటీ సపోర్ట్‌ టీమ్‌లు, పరిశుభ్రత తనిఖీ టీమ్‌లతో కూడిన టాస్క్‌ఫోర్సులను ఏర్పాటు చేయాలి. ఒక్కో టీమ్‌కు ఒక్కో బాధ్యత అప్పగించాలి.
* ప్రవేశం, నిష్క్రమణ దశలవారీగా జరిగేలా చూడాలి. ఇందుకోసం బహుళ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఏర్పాటు చేయాలి.
* పాఠశాల జరిగేంత వరకూ పిల్లలు, టీచర్లు అంతా తప్పనిసరిగా మాస్క్‌లు ధరించే ఉండాలి. తరగతి గదుల్లో కూర్చున్నప్పుడు, బృందాలుగా యాక్టివిటీలు చేసేటప్పుడు,  ప్రయోగశాలల్లో పని చేసేటప్పుడు, లైబ్రరీల్లో ఉన్నప్పుడు మాస్క్‌లు పెట్టుకోవాలి.
* భౌతికదూరం, వ్యక్తిగత భద్రతా ప్రొటోకాల్స్‌ అందరూ పాటించేలా పాఠశాలల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలు ఇంటి నుంచే చదువుకోవడానికి తల్లిదండ్రులు అనుమతిస్తే అందుకు పాఠశాలలు ఆమోదముద్ర వేయాలి.
* స్కూళ్లకు సెలవులు, పరీక్షల నిర్వహణకు సంబంధించిన తేదీలను సూచిస్తూ అన్ని తరగతులకూ అకడెమిక్‌ క్యాలెండర్‌ రూపొందించాలి.
* పూర్తిస్థాయి శిక్షణ పొందిన వైద్య సిబ్బంది, నర్సులు, డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
* అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్ర, జిల్లా, సమీప కొవిడ్‌ హెల్త్‌కేర్‌ సెంటర్ల నంబర్లను దగ్గర ఉంచుకోవాలి.
* హాజరులో సరళత పాటించాలి. అవసరమైన వారికి సిక్‌ లీవులు ఇవ్వాలి. ఆరోగ్యం బాగా లేదని అనిపించినప్పుడు విద్యార్థులు, ఉపాద్యాయులను ఇంటికే పరిమితం చేయాలి.
* ఇళ్లులేని/వలస విద్యార్థులు, దివ్యాంగులు, కొవిడ్‌ కారణంగా కుటుంబసభ్యులు ఆసుపత్రులు పాలవడమో, మరణించడమోలాంటి సంఘటనల ద్వారా ప్రభావితమైన విద్యార్థుల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* మహమ్మారి కాలంలో పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచే పౌష్టికాహారానికి ప్రాధాన్యమివ్వాలి. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనాన్ని వేడిగా వండి వడ్డించాలి. ఒకవేళ పాఠశాలలు మూసేస్తే వారి ఆహారభద్రతకు అవసరమైన భత్యం చెల్లించాలి.
 

Posted Date : 06-10-2020 .