• facebook
  • whatsapp
  • telegram

ఏపీఈసెట్‌లో 96.12 శాతం అర్హత

 * 8న వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు
ఈనాడు, అమరావతి: ఏపీఈసెట్‌లో 96.12 శాతం మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. బీటెక్‌ ఇంజినీరింగ్‌, బీఫార్మసీ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఇంజినీరింగ్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలను  అక్టోబ‌రు 6న ఆయన విడుదల చేశారు. 95.80 శాతం విద్యార్థులు, 97.31 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణులైనట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 31,891 మంది పరీక్షకు హాజరుకాగా 30,654 మంది అర్హత సాధించారు. 42 ప్రశ్నలకు సంబంధించి ప్రాథమిక ‘కీ’పై అభ్యంతరాలు వచ్చాయి. 16 ప్రశ్నలకు సమాధానాలను మార్చారు. ర్యాంకు కార్డులను  అక్టోబ‌రు 8వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఫార్మసీలో కృష్ణా జిల్లాకు చెందిన బి.అశ్లేష్‌కుమార్‌, శ్రీకాకుళానికి చెందిన జి.శాంతికి సమాన మార్కులు రావడంతో ఇద్దరికి రెండో ర్యాంకు కేటాయించారు.

9న ఏపీ ఎంసెట్‌ ఫలితాలు
అక్టోబ‌రు 9న ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు మంత్రి సురేష్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల నియామకాలను త్వరలో పూర్తి చేయనున్నామని, ఉపాధ్యాయుల బదిలీల నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామని తెలిపారు. డిగ్రీలో 30 శాతం యాజమాన్య కోటాను అమలు చేయనున్నామని, త్వరలోనే బోధన రుసుములను నిర్ణయిస్తామని వివరించారు. నవంబరు 1నుంచి ఉన్నత విద్యాసంస్థల తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టులను భర్తీ చేయొద్దని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశామని తెలిపారు.

Posted Date : 07-10-2020 .