• facebook
  • whatsapp
  • telegram

విద్యాసంస్థలు ఇప్పుడే తెరవలేం

* దసరా తర్వాత సీఎం నిర్ణయం
* నవంబరు 1 నుంచి ఉన్నత విద్యాకళాశాలల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో అక్టోబ‌రు 15 నుంచి విద్యాసంస్థల ప్రారంభం సాధ్యం కాదని విద్యాశాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు సబితారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. బతుకమ్మ, దసరా పండుగల తర్వాత దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేరళలో ఓనం పండుగ అనంతరం కరోనా మళ్లీ ఉద్ధృతరూపం దాల్చినందున మనం అప్రమత్తత వహించడం అవసరమన్నారు. యూజీసీ, ఏఐసీటీయూ నిర్ణయాలకు అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కళాశాలలు నవంబరు 1 నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలలు ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలను రూపొందించాలని, వాటి ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల నిర్వహణపై విద్యాశాఖతో పాటు సంక్షేమ శాఖలు సమన్వయంతో ఉమ్మడిగా నిబంధనలు రూపొందించాలన్నారు. ఇప్పటి వరకు సెలవులున్నందున విద్యార్థుల దృష్టి చదువు నుంచి దారి మళ్లకుండా చూడాల్సి ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పాఠశాలల ప్రారంభం, నిర్వహణ, తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం  ఉన్నతాధికారులతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలో 96 శాతంమందికి టీవీలున్నాయి. 40 శాతంమందికి నెట్‌ సదుపాయం ఉంది. 86 శాతంమందికి ఆన్‌లైన్‌ విద్య అందుతుందని ఓ సర్వే ద్వారా తేలింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 50 శాతం విద్యార్థులు ఒకరోజు హాజరైతే మిగిలిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా బోధించాల్సి వస్తుంది. రానున్న కాలంలో విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి. పాఠశాలల్లో వసతుల నిర్వహణను స్థానిక సంస్థలకు అప్పగించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో దానిపైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి’’ అని సూచించారు. కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులకు ఉపయోగపడేలా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా సమష్టి నిర్ణయం తీసుకుంటాం. ఇది ప్రైవేటు పాఠశాలలకు కూడా వర్తిస్తుంది. విద్యార్థులకు విద్య అందించడమే కాకుండా వారి ఆరోగ్యం కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత’’ అని అన్నారు. సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ ‘‘పాఠశాలల పునఃప్రారంభంలో తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో ఫోన్లు ఉన్నా సరైన సిగ్నల్స్‌ లేవు. వారికి విద్య అందించేందుకు ప్రత్యామ్నాయ విధానాలు చూడాలి. ఐటీడీఏలలో విద్యాశాఖాధికారి పోస్టులను భర్తీ చేయాలి’’ అని సూచించారు. గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ, ‘‘విద్యాసంస్థల ప్రారంభంపై అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఏ ఒక్కరికీ నష్టం జరగకూడదు. విద్యార్థులు, ఉపాధ్యాయుల విషయంలో ఒకే విధమైన నిబంధనలు ఉండాలి’’ అని సూచించారు.
‘‘కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తిగా నష్టపోకుండా చూడడం ప్రభుత్వ లక్ష్యం. కేంద్ర నిబంధనల మేరకు ఆన్‌లైన్‌ విద్య తప్పనిసరి. రానున్న కాలంలో డిజిటల్‌ విద్యాబోధన పెరగాలి. కొవిడ్‌ నిబంధనల మేరకు సగంమంది విద్యార్థులతోనే తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున మిగిలిన వారికి ఆన్‌లైన్‌ ద్వారా బోధన జరగాలి. జాతీయ స్థాయిలో మన విద్యార్థులు పోటీ పడేందుకు వీలుగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బోధన ద్వారా సిలబస్‌ పూర్తి చేయాలి’’

Posted Date : 08-10-2020 .