• facebook
  • whatsapp
  • telegram

ఇంజినీరింగ్‌ సీట్లు 1,43,254

* ఏఐసీటీఈ ఆమోదం
* త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు
* ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం అదనంగా సీట్లు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ సీట్లు ఖరారయ్యాయి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆమోదించిన జాబితాను సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. ఈ ఏడాది ప్రైవేటు, విశ్వవిద్యాలయాలకు కలిపి 1,43,254 ఇంజినీరింగ్‌ సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభించింది. వీటిల్లో 1,38,972 సీట్లు ప్రైవేటులో ఉన్నాయి. ప్రైవేటు సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటా, 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లోపు కళాశాలలవారీగా సీట్ల వివరాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

 

తనిఖీలు ముమ్మరం
మూడేళ్ల నుంచి 25 శాతంలోపు ప్రవేశాలున్న 47 కళాశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ విశ్వవిద్యాలయాలను ఆదేశించింది. ఈ మేరకు అవి తనిఖీలను పూర్తి చేశాయి. జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఇలాంటివి 18 ఉండగా, ఈ ఏడాది 16 కళాశాలల అనుబంధ గుర్తింపును నిలిపేసే అవకాశమున్నట్లు తెలిసింది. శ్రీకాళహస్తీశ్వర కళాశాలకు ఏఐసీటీఈ 360 సీట్లు కేటాయించింది. సదుపాయాలు లేకపోవడం, అధ్యాపకుల కొరత వల్ల ఈ కళాశాలను తీసుకునేందుకు జేఎన్‌టీయూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో ఇలాంటి 29 కళాశాలలపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. అక్టోబరు 15లోపు అన్ని కళాశాలల తనిఖీలు చేశాక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. తనిఖీల తర్వాత వర్సిటీలు గుర్తింపు నిలిపేస్తే సీట్ల సంఖ్య తగ్గుతుంది.

 

ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు
ఇంజినీరింగ్‌లో ఆర్థికంగా బలహీన వర్గాల(ఈడబ్ల్యూఎస్‌) కోటాను అమలు చేయనున్నారు. ఇందుకోసం కన్వీనర్‌ సీట్లలో 10శాతం పెంచనున్నారు. ఈ లెక్కన కన్వీనర్‌ కోటా సీట్లు 1,11,718 వరకు పెరగనున్నాయి.

 

ఏటా తగ్గుతున్న ప్రవేశాలు
ప్రైవేటు, డీమ్డ్‌ వర్సిటీలు, పక్క రాష్ట్రాల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతుండడంతో రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీ ఏటా తగ్గుతోంది. మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే తగ్గుదల కనిపిస్తోంది. 2017-18లో ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద 32,465 సీట్లు మిగిలిపోగా.. గతేడాదికి 41,023కు చేరింది.  మూడేళ్లలో ఇలా 659 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి.
 

Posted Date : 09-10-2020 .