• facebook
  • whatsapp
  • telegram

కొత్త కోర్సులకు ఎన్‌వోసీ వ‌చ్చేనా..?

*ఇప్ప‌టికీ ప్రభుత్వం నుంచి లభించని ఆమోదం
* ఇంజినీరింగ్‌ ప్రవేశాలపై అయోమ‌యం!

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులకు అక్టోబ‌రు 12 నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఈసారి 80,728 మంది ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి.. ఐచ్ఛికాల నమోదుకు సిద్ధమవుతుండ‌గా ఇంకా కొత్త కోర్సులకు ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ రాలేదు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలపై సందిగ్ధం నెలకొంది. 2020-21 సంవత్సరంలో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ తదితర కోర్సులను ఉన్నత విద్యామండలి అనుమతించింది. జేఎన్‌టీయూ పరిధిలోని పలు కళాశాలల్లో ఈ కోర్సులకు సంబంధించి 5,500 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వర్తింపజేసేందుకు ఆర్థిక శాఖ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉంది. ఈసారి ఈ సీట్లన్నీ దాదాపు భర్తీ అయ్యే అవకాశం ఉన్నందున ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ భారం పెరగనుందన్న కోణంలో ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త కోర్సులకు సంబంధించి ఏ కళాశాలల్లో ఆమోదం లభిస్తుంది.. ఫీజు ఎంత ఉంటుందన్న విషయమై అయోమయం నెలకొంది. గతంలోనూ ఫీజుల వివరాలు తెలపకుండా కౌన్సెలింగ్‌ నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. మరోసారి అదే పరిస్థితి పునరావృతమైతే ప్రవేశాలపై ప్రభావం పడుతుందని కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

గతేడాది సమాచారంతోనే..
జేఎన్‌టీయూ సహా కాకతీయ, ఉస్మానియా పరిధిలో కొత్త కోర్సులకు ఆమోదం రాకపోవడంతో గతేడాది అందుబాటులో ఉన్న సీట్ల వివరాలనే పంపించారు. దీనికితోడు ప్రభుత్వం నుంచి ఆమోదం రాకపోవడంతో ఆయా వర్సిటీల నుంచి గుర్తింపు ఇచ్చే విషయంపై సందిగ్ధం నెలకొంది.

Posted Date : 11-10-2020 .