• facebook
  • whatsapp
  • telegram

‘కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేలోపు ప్రభుత్వం స్పందించాలి’

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని జాతీయ ఈడబ్ల్యూఎస్‌ సమాఖ్య డిమాండ్‌ చేసింది. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షలో దాదాపు 20 వేల మంది అగ్రవర్ణ పేద విద్యార్థులు ఈడబ్ల్యూఎస్‌ కోటాలో అర్హత సాధించారని సమాఖ్య ఛైర్మన్‌ పవన్‌కుమార్‌ మల్లాది, కన్వీనర్‌ పిట్టా శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో వారికి నష్టం కలుగుతోందన్నారు. అక్టోబ‌రు 10న‌ హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వారు మాట్లాడారు. అక్టోబ‌రు 12న కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేలోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రేమ్‌గాంధీ, ప్రతినిధులు మంజులారెడ్డి, ఉప్పల రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 11-10-2020 .