• facebook
  • whatsapp
  • telegram

ఆ రెండింటిపైనే మక్కువ

* ఎంసెట్‌ ర్యాంకర్ల మనోగతం

ఈనాడు డిజిటల్‌, అమరావతి, ఈనాడు, హైదరాబాద్‌, తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: ఏపీ ఎంసెట్‌ ఇంజినీరింగ్‌లో తొలి అయిదు ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. వ్యవసాయ విభాగంలో మంచి స్థానాలు సాధించిన వారు నీట్‌ ద్వారా ఎంబీబీఎస్‌ కోర్సులో చేరతామని వెల్లడించారు. ఇంజినీరింగ్‌లో టాప్‌-10 నిలిచిన వారిలో కొందరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకులు సాధించారు. వీళ్లకి ఐఐటీల్లో ప్రవేశాలు దక్కడం దాదాపు ఖాయం. ఏపీఎంసెట్‌ ఇంజినీరింగ్‌, వ్యవసాయ విభాగాల్లో ఉత్తమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు తమ మనోగతాన్ని ‘ఈనాడు’తో పంచుకున్నారు.

 

ఇంజినీరింగ్‌ విభాగంలో..
ప్రత్యేకంగా సన్నద్ధమవలేదు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 173వ ర్యాంకు వచ్చింది. ఐఐటీలో సీఎస్‌ఈ చేయాలన్నది లక్ష్యం. జేఈఈకి చదవడంతో ఎంసెట్‌ కోసం ప్రత్యేకంగా సన్నద్ధమవలేదు. గణితం, భౌతికశాస్త్రం అంటే ఇష్టం. అమ్మానాన్నల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకులు వచ్చాయి. నా చదువు కోసమే అమ్మానాన్న శ్రీకాకుళం నుంచి వచ్చి విశాఖలో ఉంటున్నారు.     - వావిలపల్లి సాయినాథ్‌, విశాఖపట్నం (ప్రథమ ర్యాంకు)

 

ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యం

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ ఓపెన్‌ కేటగిరీలో రెండో ర్యాంకు సాధించా. ఐఐటీ బాంబేలో సీఎస్‌ఈ చదవాలని ఉంది. ఉపాధి అవకాశాలు సృష్టించాలనేది లక్ష్యం. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా.  - గంగుల భువన్‌రెడ్డి, బుడ్డాయపల్లె, కడప (మూడో ర్యాంకు)

 

సివిల్‌ సర్వీసెస్‌ సాధించాలనుంది

రోజూ 12 గంటలు చదివా. గణితం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. జేఈఈ మెయిన్‌లో 23వ ర్యాంకు, అడ్వాన్స్‌డ్‌లో 234 ర్యాంకు వచ్చింది. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో చేరాలనుంది. సివిల్స్‌ సర్వీసెస్‌లో చేరి, ప్రజలకు సేవ చేయాలని ఉంది.    - లిఖిత్‌రెడ్డి, కడప జిల్లా పులివెందుల (నాలుగో ర్యాంకు)

 

వ్యవసాయ విభాగంలో...
 
నూతన ఆవిష్కరణలే లక్ష్యం

భవిష్యత్తులో శాస్త్రవేత్తగా నూతన ఆవిష్కరణలు చేయాలన్నది లక్ష్యం. ఇందుకు ఎంబీబీఎస్‌ను ఒక మెట్టుగా భావిస్తున్నా. నీట్‌ కోసం సన్నద్ధమవడం ఎంసెట్‌కు ఉపయోగపడింది. నీట్‌లో మంచి ర్యాంకు వస్తుందని భావిస్తున్నా. మంచి ర్యాంకు సాధించడానికి అమ్మ, ఉపాధ్యాయులు అందించిన సహకారమే కారణం.           - జి.చైతన్య సింధు, తెనాలి, గుంటూరు జిల్లా (ప్రథమ ర్యాంకు)

 

లాక్‌డౌన్‌ సద్వినియోగం చేసుకున్నా

లాక్‌డౌన్‌లో దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఎక్కువ పరీక్షలు రాస్తూ సన్నద్ధమవడం చాలా ఉపకరించింది. ఎయిమ్స్‌లో న్యూరాలజీ వైద్యురాలిగా సేవలందించాలన్నది లక్ష్యం. నాన్న గణిత అధ్యాపకుడు, అమ్మ గృహిణి. నీట్‌లో 690 మార్కులు వస్తాయని అంచనా వేస్తున్నా.        - త్రిపురనేని లక్ష్మీ సాయి మారుతి, తాడికొండ, గుంటూరు (రెండో ర్యాంకు)

 

ప్రణాళికతో చదవడం వల్లే

భవిష్యత్తులో వైద్యుడిగా పేదలకు సేవలందించాలన్నదే లక్ష్యం. వైద్య విద్య దిశగా అడుగులు వేయడంలో అమ్మానాన్నలే స్ఫూర్తి. నాన్న ఆర్‌.వెంకట్‌, అమ్మ ఎం.రమాదేవి ఇద్దరూ తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. అధ్యాపకులు చెప్పే పాఠాలు విని, ఎప్పటికప్పుడు వాటిని రాసుకొని.. చదవడం వల్లే ర్యాంకు సాధ్యమైంది.   - వి.మనోజ్‌ కుమార్‌, తిరుపతి (మూడో ర్యాంకు)
 

Posted Date : 11-10-2020 .