• facebook
  • whatsapp
  • telegram

హైదరాబాద్‌లో ఇంటెల్‌ ఏఐ పరిశోధనా కేంద్రం

ఐఐఐటీహెచ్‌, తెలంగాణ ప్రభుత్వంతో  భాగస్వామ్యం
కృతిమ మేధ రంగంలో ఇది కీలక  మైలురాయి - కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మొబిలిటీ రంగాల్లో ఉన్న సమస్యలకు కృత్రిమ మేధ ద్వారా పరిష్కారాలు చూపించేందుకు టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్‌ హైదరాబాద్‌లో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనికోసం ఐఐఐటీ-హైదరాబాద్‌ (ఐఐఐటీ), తెలంగాణ ప్రభుత్వంతో పాటు పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీహెచ్‌ఎఫ్‌ఐ)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సోమవారం ‘ఆల్‌.ఏఐ.2020’ దృశ్యమాధ్యమ సదస్సులో భాగంగా ఈ ‘ఐఎన్‌ఏఐ’ కేంద్రాన్ని ప్రారంభించింది. సామాజికాభివృద్ధి కోసం.. ప్రపంచ ప్రతిభను ఆకర్షించడం కోసం ఏఐలో సరికొత్త ఆవిష్కరణలు, క్యూరేటెడ్‌ డేటా సెట్స్‌, కంప్యూటింగ్‌ మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అంకుర వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో ఇది అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. పరిశ్రమ, విద్యా సంస్థలు, ప్రభుత్వ సహకారంతో భారత్‌ కృత్రిమ మేధ రంగంలో మరింత ముందుకు దూసుకెళ్లేందుకు ఐఎన్‌ఏఐ తోడ్పడుతుందని ఈ సందర్భంగా ప్రకటించింది. అప్లైడ్‌ పరిశోధన, అధునాతన కృత్రిమ మేధ తదితరాల ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తోడ్పడటమే దీని లక్ష్యమని ఇంటెల్‌ తెలిపింది. ఐఎన్‌ఏఐ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.రామారావు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు తాము కృత్రిమ మేధను వాడుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో అప్లైడ్‌ ఏఐ పరిశోధనా కేంద్రం ఐఎన్‌ఏఐని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం ద్వారా డిజిటలీకరణ ప్రయాణంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నట్లు అయ్యిందని పేర్కొన్నారు. ఇంటెల్‌ ఇండియా కంట్రీ హెడ్‌, ఇంటెల్‌ కార్పొరేషన్‌ డేటా ప్లాట్‌ఫామ్స్‌ గ్రూప్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నివృతి రాయ్‌ మాట్లాడుతూ.. భారత్‌ అధునాతన సాంకేతికతలను వేగంగా అందిపుచ్చుకుంటోందని, ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్‌ మెబిలిటీ రంగాల్లో అనేక సమస్యల పరిష్కారానికి ఇది అవసరమని పేర్కొన్నారు. అప్లైడ్‌ ఏఐ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా భారత్‌కు ఏఐని మారుపేరుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఐఐటీ-హెచ్‌ విస్తృత కంప్యూటింగ్‌, విద్యా నైపుణ్యాలు, ఇంటెల్‌ సాంకేతిక నాయకత్వం, పీహెచ్‌ఎఫ్‌ఐ ప్రజారోగ్యంలో నైపుణ్యం దీనికి ఎంతో తోడ్పడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. దీంతోపాటు, ఇతర సంస్థల సహకారాన్ని తీసుకోవడం ద్వారా వినూత్న ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారం, వ్యవస్థాపకత అభివృద్ధి, ఉద్యోగాల కల్పన లాంటి వాటికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

Posted Date : 13-10-2020 .