• facebook
  • whatsapp
  • telegram

జోరందుకున్న ఉద్యోగ నియామ‌కాలు

సెప్టెంబ‌రులో 24 శాతం వృద్ధి
నౌక‌రీ జాబ్స్‌స్పీక్ సూచీ 

ముంబయి: కొవిడ్‌-19 ప్రభావం నుంచి జనజీవనం ఇప్పుడిప్పుడే క్రమంగా గాడిలో పడుతోంది. ఒక పక్క ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. దీంతో సెప్టెంబరులో ఉద్యోగ నియామకాలు మెరుగుపడ్డాయి. నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ ప్రకారం.. ఔషధ, విద్యా రంగాలు దన్నుగా నిలవడంతో సెప్టెంబ‌రులో నియామకాలు 24 శాతం వృద్ధి చెందాయి. ఆగస్టులో 1,413 ఉద్యోగావకాశాలు రాగా.. సెప్టెంబరులో ఆ సంఖ్య 1,755కు చేరింది. నౌకరీ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌పై నమోదయ్యే ఉద్యోగాల ఆధారంగా నియామకాలను నౌకరీ జాబ్‌స్పీక్‌ సూచీ గణిస్తుంది. ఇందులోని మరిన్ని అంశాలు ఇలా.. 
ఔషధ రంగంలో నియామకాలు 44 శాతం పెరిగాయి. తర్వాతి సానాల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ (43%), విద్య, బోధన (41%), ఐటీ (32%) ఉన్నాయి.
అన్‌లాక్‌ చర్యలతో ప్రజల రాకపోకలు ఊపందుకున్నాయి. దీంతో స్థిరాస్తి (44%), వాహన, విడిభాగాలు (29%), ఆతిథ్యం, పర్యాటకం (48%) చొప్పున నియామకాలను పెంచాయి. 
కీలక రంగాలైన బీపీఓ, ఐటీఈఎస్‌ (29%), బ్యాంకింగ్, ఆరిక సేవలు (33%) చొప్పున వృద్ధిని నమోదు చేసి జోరు కొనసాగించాయి. 
నగరాల వారీగా చూస్తే.. పుణె (26%), హైదరాబాద్, చెన్నై (24%), బెంగళూరు 14% చొప్పున వృద్ధి సాధించాయి. ద్వితీయ శ్రేణి నగరాలు అయిన అహ్మదాబాద్‌ (34%), చండీగఢ్‌ (39%), జయపూర్‌ (36%)ల్లో నియామకాలు గణనీయంగా పుంజుకున్నాయి.
మధ్యస్థాయి నిపుణుల (8-12 ఏళ్ల అనుభవం)కు గిరాకీ 27% పెరిగింది. ఇక 0-3 ఏళ్ల అనుభవం (25%), 4-7 ఏళ్లు (23%), 13-16 ఏళ్లు (24%), 16 ఏళ్ల లోపు (19%) వారు తర్వాతి సానాల్లో ఉన్నారు.  

Posted Date : 13-10-2020 .