• facebook
  • whatsapp
  • telegram

పాఠశాల విద్య బలోపేతానికి స్టార్స్‌

* 11 రాష్ట్రాల్లో అమలు
దిల్లీ: పాఠశాల విద్యను బలోపేతం చేయడంలో రాష్ట్రాలకు మద్దతుగా నిలిచేందుకు కేంద్రం కొత్త ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అక్టోబ‌రు 14న‌ జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘బోధన అనుభవాలను బలోపేతం చేయడం, రాష్ట్రాలకు ఫలితాలు’ అనే అర్థంలో సూక్ష్మంగా దీనికి ‘స్టార్స్‌’ అని పేరు పెట్టారు. ప్రపంచ బ్యాంకు సాయంతో కేంద్ర విద్యాశాఖ చేపట్టే ఈ ప్రాజెక్టుకు వ్యయం రూ.5718 కోట్లుగా అంచనా వేశారు. హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) నిధులతో మరో ఐదు రాష్ట్రాల్లో అమలవుతుంది. పాఠశాల విద్యలో ఫలితాలను మెరుగుపరచడం దీని లక్ష్యమని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ విలేకరులకు తెలిపారు. నూతన విద్యా విధానం-2020 అమలులో భాగంగా దీనిని కేబినెట్‌ ఆమోదించిందని వివరించారు. ‘‘మూస పద్ధతిలో వెళ్లకుండా మంచి ఫలితాలను రాబట్టి ఉపాధి అవకాశాలను కల్పించేదిగా విద్యావ్యవస్థను మార్చడమే ప్రభుత్వ ఉద్దేశం. అర్థం చేసుకుని నేర్చుకునేందుకు విద్యార్థులకు ఆస్కారం ఉంటుంది. సమర్థతపై ఆధారపడేలా బోర్డు పరీక్షలను మెరుగుపరుస్తాం. ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, మదింపు చేయడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థను తీసుకు    వస్తాం’’ అని జావడేకర్‌ తెలిపారు. వీటన్నింటి కోసం ‘పరాఖ్‌’ పేరుతో స్వయం ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎంపిక చేసిన రాష్ట్రాలు తమ అనుభవాలను ఇతర రాష్ట్రాలతో ఆన్‌లైన్‌లో పంచుకునేలా ఈ సంస్థ చూస్తుందన్నారు.

Posted Date : 15-10-2020 .