నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు బడులు

* పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు 
 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలను నవంబరు 2 నుంచి తెరిచేందుకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ కేలండర్‌ను సిద్ధం చేస్తోంది. సాధారణ పరిస్థితుల్లో 220 పనిదినాలు రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ఇప్పటివరకు తరగతులే ప్రారంభం కాలేదు. దీంతో పనిదినాల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యాంశాలు (సిలబస్‌) తగ్గించేందుకు కసరత్తు చేస్తోంది. జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్టీ) సగం పాఠ్యాంశాలు తగ్గించే యోచనలో ఉన్నందున ఇదే విధానాన్ని పాటించాలని భావిస్తోంది. పండుగల సెలవులనూ తగ్గించనున్నారు. తరగతుల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఉపాధ్యాయులపైనా పరిమితి విధిస్తూ సంచాలకులు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.
* నవంబరు 2 నుంచి ఏప్రిల్‌ 30 వరకు పాఠశాలలు పనిచేస్తాయి.
* పండుగల సెలవులు కుదింపు. వారానికి ఆరు పనిదినాలు.
* సంక్రాంతికి మూడురోజులే సెలవులు.
* ఉపాధ్యాయులు నెలకు రెండున్నర చొప్పున నవంబరు, డిసెంబరుల్లో ఐదు రోజులే సాధారణ సెలవులు (సీఎల్‌) వినియోగించుకోవాలి.
* ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షల నిర్వహణ
హాజరుపట్టీలో కులమతాలు వద్దు
పాఠశాల హాజరుపట్టీలో విద్యార్థుల కులం, మతం వివరాలు రాయొద్దని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బాలికల పేర్లను ఎర్రసిరాతో రాయకూడదని, అందరిపేర్లూ ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. ఈ విషయాల్లో ఇప్పటివరకు ఉన్న విధానాలను నిలిపివేయాలని ఆదేశించారు.

Posted Date : 15-10-2020 .