• facebook
  • whatsapp
  • telegram

ఏఎన్‌యూ పీజీ సెట్‌ ఫలితాల విడుదల

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ కళాశాలల్లో చేరేందుకు నిర్వహించిన పీజీసెట్‌ ఫలితాలను అక్టోబ‌రు 14న ఎఫ్‌ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌ విడుదల చేశారు. పరీక్షలు ముగిసిన రెండు రోజుల్లోనే ఫలితాలను విడుదలచేసిన అధికారులను ఆయన అభినందించారు. మొత్తం 9,834 మంది హాజరవగా, 7,527 మంది అర్హత సాధించారు. లైఫ్‌సైన్స్‌లో మధులత, ఫిజికల్‌ సైన్స్‌లో భాను ప్రకాష్‌, గణితంలో సమీరా, గణంకాల్లో సుస్వర, కెమికల్‌ సైన్స్‌లో భవ్య, జియాలజీలో హదస్సారాయ్‌, సోషల్‌సైన్స్‌లో ఆంజనేయరాజు, ఇంగ్లిష్‌లో అభినయ, తెలుగులో ఏడుకొండలు, కామర్స్‌లో మనోజ్‌కుమార్‌, ఎడ్యుకేషన్‌లో శైలజాకుమార్‌లు మొదటి ర్యాంకులు సాధించారు. ప్రవేశాల విభాగం సంచాలకులు డాక్టర్‌ హరిబాబు మాట్లాడుతూ అక్టోబ‌రు  ఆఖరి వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. అక్టోబ‌రు 22న ఫైన్‌ఆర్ట్స్‌ కోర్సులో ప్రవేశ అర్హత పరీక్ష, డిప్లొమో కోర్సులకు అదేరోజు ప్రవేశ పరీక్ష, కౌన్సెలింగ్‌ ఉంటాయన్నారు. పీజీ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు ర్యాంకు కార్డు, పీజీసెట్‌ హాల్‌టిక్కెట్‌, డిగ్రీ ప్రొవిజనల్‌, పది, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితాలు, టీసీలు, ఆదాయ, కుల ధ్రువపత్రాలు తీసుకురావాలన్నారు. రెక్టార్‌ ఆచార్య వరప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య కనపర్తి రోశయ్య, సీడీసీ డీన్‌ డాక్టర్‌ రామిరెడ్డి, పీజీ పరీక్షల విభాగం కన్వీనర్‌ డాక్టర్‌ అనిత, డాక్టర్‌ మధుబాబు తదితరులు పాల్గొన్నారు.

Posted Date : 15-10-2020 .