జేఎన్‌టీయూ పరిధిలో భారీగా ఇంజినీరింగ్‌ సీట్లు 

* 6 కొత్త కోర్సుల్లో 18,210 సీట్లకు ప్రతిపాదన

ఈనాడు, హైదరాబాద్‌: జేఎన్‌టీయూ పరిధిలో భారీగా ఇంజినీరింగ్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. గతేడాది 64 శాతం సీట్లే భర్తీ జరిగినప్పటికీ, ఈఏడాది వాటి సంఖ్య పెంచాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వర్సిటీ పరిధిలోని 157 కళాశాలల్లో మొత్తం 90,345 సీట్లు అందుబాటులోకి వస్తాయి. వీటిలో ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టనున్న కోర్సులకు సంబంధించిన సీట్లూ ఉన్నాయి. 2020-21వ సంవత్సరానికి ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబ‌రు 18 నుంచి వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ నిర్ణయించగా.. సీట్ల వివరాలను జేఎన్‌టీయూ ఉన్నత విద్యామండలికి అందించింది. గతేడాది 80,829 సీట్లు ఉండగా 51,677 సీట్లు భర్తీ అయ్యాయి.

కొత్త కోర్సులకు సూత్రప్రాయంగా ఓకే!

ఈసారి జేఎన్‌టీయూ పరిధిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, కృత్రిమ మేధ-మెషిన్‌ లెర్నింగ్‌, డాటా సైన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, నెట్‌వర్క్స్‌ అనే 6 రకాల కొత్త కోర్సులు రానున్నాయి. వీటికి సంబంధించి 18,210 సీట్లు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కళాశాలలు ఇందులో డిమాండ్‌ లేని కోర్సులకు సంబంధించిన 13,890 సీట్లు ఎత్తివేసి.. వాటిస్థానంలో కొత్త కోర్సుల సీట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కళాశాలలు మరో 4,320 కొత్త సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. తాజాగా కొత్త కోర్సులు, సీట్లకు ఆమోదం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. నేడో, రేపో ఈ ఉత్తర్వులు వెలువడితే.. 17వ తేదీ సాయంత్రంలోగా సీట్ల వివరాలను ఎంసెట్‌ కమిటీకి పంపాలని జేఎన్‌టీయూ కసరత్తు చేస్తోంది. బీఫార్మసీలో ఈ విద్యాసంవత్సరానికి 6,780 సీట్లు.. ఎంటెక్‌ కోర్సుల్లో 7,563 సీట్లు అందుబాటులోకి తేవాలని జేఎన్‌టీయూ నిర్ణయించింది.

Posted Date : 16-10-2020 .