• facebook
  • whatsapp
  • telegram

టీఎస్‌ పీజీఈసెట్‌ ఫలితాల విడుదల  

* 86 శాతం ఉత్తీర్ణత
ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్‌ పీజీఈసెట్‌ ఫలితాలు అక్టోబ‌రు 16న‌ విడుదలయ్యాయి.. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి, వైస్‌ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఓయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి, సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎం.కుమార్, ప్రొఫెసర్‌ భీక్ష్మ ఫలితాలను విడుదల చేశారు. పీజీ ఈసెట్‌కు మొత్తం 22,282 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో  ప్రవేశ పరీక్షలకు 16,807 మంది హాజరైతే 14,456 (86.01శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 39.64 శాతం, బాలురు 46.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ పాపిరెడ్డి మాట్లాడుతూ టీఎస్‌ పీజీఈసెట్‌ ప్రవేశ పరీక్షలను 19 విభాగాలలో నిర్వహించారని తెలిపారు. ఇంజినీరింగ్‌ సప్లమెంటరీ ఫలితాలు వచ్చిన తరువాత ప్రవేశాల కోసం ప్రకటన జారీ చేస్తామని ప్రకటించారు. ఫార్మసీ విభాగంలో రిమ్షా నూరియన్‌ ,సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎన్‌.గణేష్‌కుమార్, మోకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఈశ్వర రామసాయి, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో సాయికృష్ణ, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో విష్ణు.వి.చారి, ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో ఉదయ్‌కుమార్‌ మొదటి ర్యాంకులు సాధించారు.

Posted Date : 16-10-2020 .