• facebook
  • whatsapp
  • telegram

నీట్ ర్యాంకుల్లో తీవ్ర పోటీ

* సాధించిన మార్కులు సమానమైనా శ్రేణులు మారిపోయాయి!

దిల్లీ: నీట్‌ ఫలితాలు విద్యార్థుల మధ్య నెలకొన్న తీవ్రపోటీని ప్రతిబింబించాయి. 720 మార్కులు సాధించి సమ ఉజ్జీలుగా నిలిచిన ఇద్దరు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ర్యాంకులను పొందారు. ఒకేవిధమైన మార్కులు వచ్చినప్పుడు తొలుత జీవశాస్త్రం, ఆ తర్వాత రసాయనశాస్త్రాల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకు కేటాయిస్తారు. వాటిలోనూ సమానంగా వస్తే వయసులో ఎవరు పెద్దయితే వారికి ర్యాంకుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తుంది. ఈ నిబంధన ఆధారంగానే ఒడిశాకు చెందిన సోయబ్‌ అఫ్తాబ్‌కు ప్రథమ ర్యాంకు కేటాయించారు. దిల్లీకి చెందిన ఆకాంక్షా సింగ్‌కు ద్వితీయ ర్యాంకు దక్కింది. మూడో ర్యాంకు కోసం కూడా నలుగురి మధ్య పోటీ జరిగింది. తుమ్మల స్నికిత (తెలంగాణ), వినీత్‌ శర్మ (రాజస్థాన్‌), అమ్రిష ఖైతాన్‌ (హరియాణా), గుత్తి చైతన్య సింధు (ఆంధ్రప్రదేశ్‌) నలుగురూ 720కి గాను 715 చొప్పున మార్కులు సాధించారు. నిబంధనలను అనుసరించి వీరికి వరుసగా..మూడు, నాలుగు, అయిదు, ఆరో ర్యాంకును కేటాయించారు. 8 నుంచి 20వ ర్యాంకు వరకు పొందిన విద్యార్థులంతా 710 చొప్పున మార్కులు సాధించారు. 25 నుంచి 50వ ర్యాంకు పొందిన విద్యార్థులు 705 మార్కులు చొప్పున పొందారు. వీరందరికీ మార్కులు సమానమైనప్పటికీ ప్రాధాన్య సబ్జెక్టులు, వయసు నిబంధనలను వర్తింపచేసి ర్యాంకులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

Posted Date : 17-10-2020 .