23 నుంచి ఏపీ ఎంసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన 

ఈనాడు, అమరావతి: ఏపీ ఎంసెట్‌(ఎంపీసీ స్ట్రీమ్‌) ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల భర్తీకి కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ అక్టోబ‌రు 16న  ప్రకటన జారీ చేశారు. అక్టోబ‌రు 23 నుంచి 27 వరకు విద్యార్హత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సీట్ల ఎంపిక ఐచ్ఛికాలకు మరోసారి ప్రత్యేకంగా ప్రకటన జారీ చేయనున్నారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.1,200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.600లను ప్రాసెసింగ్‌ రుసుముగా చెల్లించాలి. విద్యార్హత ధ్రువపత్రాల్లో అసంపూర్తి, ఏమైనా మార్పులు చేసుకోవాలంటే సహాయ కేంద్రాలను సంప్రదించాలి. ఇవి ఉదయం 9గంటల నుంచి పని చేస్తాయి. 2 జూన్‌ 2014 నుంచి 1జూన్‌ 2021 వరకు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన విద్యార్థులు స్థానికత ధ్రువపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. వీరిని స్థానికులుగా గుర్తిస్తారు. సమస్యల పరిష్కారానికి ఈ ఫోన్‌ నంబర్లలో 81068 76345, 81065 75234, 79958 65456, 79956 81678 సంప్రదించవచ్చు.

Posted Date : 17-10-2020 .