సిలబస్‌ తగ్గింపు వద్దు

* ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన
* సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ


ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏ తరగతికీ సిలబస్‌ తగ్గించకూడదని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. పనిదినాలు తగ్గినందున సిలబస్‌ కూడా తగ్గిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నెల రోజుల క్రితం స్పష్టంచేశారు. కరోనా పరిస్థితులపై సమీక్షించిన జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) ప్రస్తుతానికి 30 శాతం తగ్గించాలని సూచించింది. ఆ ప్రకారం సీబీఎస్‌ఈ 9-12 తరగతులకు మూడు నెలల క్రితమే 30 శాతం పాఠ్య ప్రణాళికను తగ్గించింది. మిగిలిన తరగతులకు సిలబస్‌ను ఆయా పాఠశాలలే నిర్ణయించుకోవచ్చని తెలిపింది. ఏ అంశాలను తొలగించాలో ఎస్‌సీఈఆర్‌టీ  పాఠశాల విద్యాశాఖకు సూచించింది. సీబీఎస్‌ఈ మాదిరిగానే ఇక్కడా 30 శాతం సిలబస్‌ తగ్గిస్తారని అందరూ భావించారు.అందుకు భిన్నంగా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

సిలబస్‌ తగ్గించకపోతే భారమే
పాఠశాల పనిదినాలు తగ్గితే పాఠ్య ప్రణాళిక తగ్గించాల్సి ఉంటుందని, మొత్తం సిలబస్‌ను బోధించాలన్నా...విద్యార్థులు చదవాలన్నా భారంగా మారుతుందని ఉపాధ్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సీబీఎస్‌ఈ 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించాలని భావిస్తుంటే ఇక్కడ అసలే తగ్గించకపోవడం మంచిది కాదని కొందరు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
 

కొన్ని పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలుండవు
పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరిని ‘ఈనాడు’ సంప్రదించగా సిలబస్‌ను తగ్గిస్తే భవిష్యత్తులో నీట్‌ లాంటి పరీక్షలను ఎదుర్కోవడం కష్టమవుతుంది కదా?...పై తరగతుల్లోని పాఠాలు అర్ధంకావాలి కదా? అని ప్రశ్నించారు. సిలబస్‌ తగ్గించకపోయినా కొన్ని పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు ఉండవన్నారు. వాటికి సంబంధించి ప్రాజెక్టులు, అసైన్‌మెంట్లు మాత్రమే ఇస్తామన్నారు. సిలబస్‌ తగ్గించాల్సిన అవసరం లేదన్న పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
 

అకడమిక్‌ క్యాలెండర్‌ ఇంకెప్పుడో?
ఆన్‌లైన్‌ తరగతులు కూడా మొదలుపెట్టి నెలన్నర అవుతున్నా ఇప్పటివరకు ఈ విద్యా సంవత్సరం పనిదినాలు ఎన్ని, సెలవులు, పరీక్షలు ఎప్పుడు? తదితర అంశాలతో కూడిన అకడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేయలేదు. పాఠశాల విద్యాశాఖ నుంచి దానిపై 20 రోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదన అందింది. అయినా స్పష్టత రాలేదు. దసరా వస్తున్నందున ఎన్ని రోజులు సెలవులన్నది స్పష్టంచేయాలి. విద్యా క్యాలెండర్‌ ప్రకటించకపోవడంతో ఉపాధ్యాయులకు సెలవుల సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. విద్యాశాఖ అధికారులు మాత్రం త్వరలోనే ప్రకటిస్తామని చెబుతున్నారు.
 

Posted Date : 17-10-2020 .